రాజ్య‌స‌భ రేస్‌.. టీడీపీలో లోకేష్ ఛాయిస్ అత‌నేనా?

admin
Published by Admin — June 01, 2026 in Politics, Andhra, National
News Image

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. ఏపీ కోటాలో జూన్ 26తో ముగియనున్న నాలుగు స్థానాలకు ఈ షెడ్యూల్ విడుదల కాగా, ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఈ నాలుగు సీట్లూ కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఈసారి ఢిల్లీ పెద్దల సభకు వెళ్లే ఆ అభ్యర్థులు ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. 

కూటమి సమీకరణాల్లో భాగంగా మిత్రపక్షాలకు ఒక సీటు కేటాయించినా, మిగిలిన స్థానాలపై టీడీపీ(TDP) ఆశావహులు భారీగా కన్నేశారు. అయితే ఈసారి అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ వ్యూహాలు కూడా కీలకంగా మారాయి. గత కొంతకాలంగా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికి, యువ నాయకత్వానికి ఈసారి పెద్దపీట వేయాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన ఒక నేత పేరు అమరావతి సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.

టీడీపీ అంతర్గత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. లోకేష్‌(Nara Lokesh)కు అత్యంత ఆప్తుడిగా పేరున్న కిలారు రాజేష్‌ పేరు ప్రస్తుతం రాజ్యసభ రేసులో ముందంజలో ఉంది. కిలారు రాజేష్‌కు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం కల్పించాలని లోకేష్ గట్టిగా పట్టుబడుతున్నట్లు టాక్. లోకేష్ మార్క్ యువ రాజకీయాలకు ప్రతీకగా రాజేష్‌ను ఢిల్లీకి పంపేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అవుతోందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

మరోవైపు, ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్న వారిలో ఒకరైన సానా సతీష్(Sana Satish).. తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. గతంలో తక్కువ కాలపరిమితితోనే సభలోకి వెళ్లినందున, ఈసారి పూర్తి స్థాయి టర్మ్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే, కిలారు రాజేష్, సానా సతీష్‌లలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. వీరిద్దరిలో ఒకరికే అవకాశం దక్కే ఛాన్స్ ఉందనే విశ్లేషణల నడుమ, లోకేష్ తన ఛాయిస్‌ను చంద్రబాబు వద్ద నెగ్గించుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

కేవలం ఈ ఇద్దరి మధ్యే కాకుండా, టీడీపీ నుంచి సీనియర్ నేతల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, విద్యావేత్త భాష్యం రామకృష్ణ, సీనియర్ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావు లాంటి పెద్దలు కూడా అధిష్టానం వద్ద తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీటన్నింటికీ తోడు, చంద్రబాబు(Chandrababu) ఎప్పుడూ చివరి నిమిషంలో సోషల్ ఇంజనీరింగ్ సమీకరణాలను తెరపైకి తెస్తుంటారు. అందులో భాగంగానే ఈసారి ఆర్థిక బలం, సామాజిక వర్గ సమీకరణాలు కలగలిసిన ఒక మహిళా నేతను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, జూన్ 8వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో, ఈ లోపే అభ్యర్థులపై స్పష్టత రానుంది. మరి లోకేష్ అనుకున్నట్లే కిలారు రాజేష్‌కు సీటు దక్కుతుందా? లేక చంద్రబాబు సీనియారిటీ, మహిళా సెంటిమెంట్‌కే ఓటేస్తారా? అనేది తేలాలంటే మరికొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

Tags
TDP Rajya Sabha Nara Lokesh CM Chandrababu BJP Janasena Kilaru Rajesh Sana Satish
Recent Comments
Leave a Comment

Related News