ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్‌పల్లి మండలం జన్వాడలో ఉన్న భూమిని పవన్ కబ్జా చేశారని సోషల్ మీడియాలో పవన్ పై కొందరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలను జనసేన నేతలు ఖండిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో పవన్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ కు వస్తున్న పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేక ప్రత్యర్థులు నిరాధారమైన ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ జీవితం ఒక తెరిచిన పుస్తకం వంటిదని అన్నారు. ఈ అసత్య ప్రచారాలతో పవన్ పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేని వారే ఇటువంటి నిందలు వేస్తారని విమర్శించారు.
ఆ భూమిని పవన్ కల్యాణ్ 2014లోనే చట్టబద్ధంగా కొన్నారని, అది వ్యవసాయ భూమి అని తెలిపారు. చట్టపరంగా అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మ్యుటేషన్ కూడా చేయించుకున్నారని చెప్పారు. ఆ భూమిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేవని, కేవలం వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని చెప్పారు. కబ్జా అనే ఆరోపణ పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. కాగా, ఆ భూమికి సంబంధించిన పన్నులను కూడా పవన్ కల్యాణ్ క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు.