ఏపీ సీఎం చంద్రబాబు పాలన పరంగా మంచి మార్కులు వేయించుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందు కు తీసుకువెళ్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యవహారాలు ఆయనకు పెద్ద ఇబ్బందిగా మారాయి. దీంతో పదే పదే వారిని హెచ్చరించడం.. పరిస్థితిని సరిచేసుకోవాలని చెప్పడం తెలిసిందే. ఇక, తాజాగా ఓ కీలక వ్యవహారం ఢిల్లీ వరకు చేరింది. దీనిపై ప్రభుత్వానికి కూడా తాజాగా సమాచారం అందింది. ఈ విషయం మీకు తెలుసా? ఇలా చేస్తే ఎలా? అంటూ.. కేంద్రం నుంచి తాఖీదులు అందాయి.
ఏంటి విషయం..?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జాతీయ రహదారుల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఇటీవల టెండ ర్లను ఆహ్వానించింది. ఈ శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ ఉన్నారు. ఈయన ఎంత నిఖార్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఇక్కడే కొందరు తమ్ముళ్లు చేతులు కలిపి.. ఈ రహదారుల నిర్వహణ టెండర్లను దొడ్డిదారిలో దక్కించుకున్నారన్నది తాజాగా కేంద్రం చేసిన ఆరోపణ. జాతీయ రహదారులు 43, 340ల నిర్వహణకు.. కేంద్ర ప్రభుత్వం 11 కోట్లరూపాయలను కేటాయించింది. దీనికి సంబంధించి ఇటీవల టెండర్లను పిలిచింది.
అయితే.. ఈ పనులను దక్కించుకునేందుకు సాధారణంగా నిర్వహించే టెండర్లను అధికారులు చేపట్టారు.కానీ, ఇక్కడే రంగంలోకి దిగిన ఓ కీలక ఎమ్మెల్యే.. క్షేత్రస్థాయిలో మరో ఇద్దరిని కలుపుకొని.. ఇతరులు ఎవరూ టెండర్లు వేయకుండా అడ్డుకున్నారన్నది కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నిర్వహణ సంస్థలతోనూ వీరుకుమ్మక్కయ్యారని అంటున్నారు. నిజానిని హైవేల నిర్వహణకు కేంద్రం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో అర్హత గల కాంట్రాక్టర్లను మాత్రమే తీసుకుంటుంది.
కానీ, ఈ విషయంలో జోక్యం చేసుకున్న తమ్ముళ్లు.. ఉద్దేశపూర్వకంగా అర్హులైన కాంట్రాక్టర్లను తప్పించడమే కాకుండా, తాము సృష్టించిన కంపెనీలను రంగంలోకి దింపారని తెలిసింది. క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక 'రింగ్'గా ఏర్పడి.. ముందుగానే ఎంచుకున్న సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారు. దీనిని గమనించిన కేంద్రం తాజాగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాఖీదులు పంపినట్టు తెలిసింది. నిజానికి ఇలాంటి పనులు చేపట్టే సంస్థకు ఉండాల్సిన అర్హతలను కేవలం కాయితాలపైనే చూపించారన్నది మరో విమర్శ. మొత్తంగా.. ఇప్పుడు చంద్రబాబు.. ఢిల్లీలో ఉన్న ఇమేజ్‌కే ఇది సవాల్‌గా మారింది. దీనిపైకేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.