ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హుటాహుటిన ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్(CM Devendra Fadnavis)తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పైకి ఇది కేవలం రెండు రాష్ట్రాల మధ్య విధానాల అధ్యయనానికి సంబంధించిన పర్యటనగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి, ఏపీ(AP)లో త్వరలో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఇప్పుడు కూటమి పార్టీల మధ్య ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ఈ నాలుగు సీట్లు క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూటమికే ఉంది. అయితే, వీటిని టీడీపీ, జనసేన పంచుకుంటాయనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, బీజేపీ అధిష్టానం కూడా రేసులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త లేదా కీలక నేతకు ఏపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలనే ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే లోకేష్ ముంబై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీ అనంతరం నారా లోకేష్(Nara Lokesh) తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. మహారాష్ట్రలో అమలు అవుతున్న ఐటీ, విద్యా రంగాల్లోని అత్యుత్తమ విధానాలను పరిశీలించడానికి, అలాగే పెట్టుబడులను ఆకర్షించడానికే తాను ముంబై వచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వాదనతో పూర్తిగా ఏకీభవించడం లేదు. ఇటీవలే ఏపీలోనే అత్యుత్తమ ఐటీ విధానాలు ఉన్నాయని ప్రకటించిన లోకేష్, ఇప్పుడు అకస్మాత్తుగా పక్క రాష్ట్ర విధానాల కోసం వెళ్లడం వెనుక అసలు కథ వేరే ఉందంటున్నారు.
రాజ్యసభ స్థానాల సర్దుబాటులో భాగంగానే చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన నమ్మకస్థుడైన లోకేష్‌ను రాయబారానికి పంపించారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్‌తో పాటు కొందరు ఎంపీలు కూడా ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. బీజేపీ అడుగుతున్న సీటును ఇస్తే సొంత పార్టీలో తలెత్తే అసంతృప్తిని ఎలా చల్లార్చాలి? ఒకవేళ ఇస్తే దానికి బదులుగా ఏపీకి దక్కే ప్రయోజనాలేంటి? అనే అంశాలపైనే ఫడణవీస్‌తో లోకేష్ సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. స్క్రీన్ ముందు ఐటీ ముచ్చట్లు నడుస్తున్నా, స్క్రీన్ వెనుక మాత్రం పక్కా పొలిటికల్ కాలిక్యులేషన్స్ జరిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.