ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాల పర్వం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy), పవన్ కళ్యాణ్ మధ్య నడిచే పొలిటికల్ మైండ్ గేమ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. గత ఎన్నికల్లో జనసేనానిని దెబ్బకొట్టేందుకు వైసీపీ వేసిన ప్లాన్-ఎ ఘోరంగా ఫెయిలైంది. పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, కాపు కార్డుతో ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దించడం వంటి వ్యూహాలు బెడిసికొట్టాయి. అయితే, నాటి పరాభవాన్ని మర్చిపోయి జగన్ ఊరికే కూర్చోలేదు. వైసీపీ 2.0 పేరుతో సరికొత్త పద్మవ్యూహాన్ని రచిస్తూ.. ఈసారి పవన్ కళ్యాణ్‌ను ముగ్గులోకి దించేందుకు మరింత పక్కాగా ప్లాన్ బి ని సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది.
గతంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను ఓడించడమే లక్ష్యంగా పిఠాపురంలో వైసీపీ భారీ వ్యూహాన్ని అమలు చేసింది. పవన్ కాపు సామాజికవర్గానికి ద్రోహం చేస్తున్నాడంటూ ముద్రగడ పద్మనాభం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది. చివరికి పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానన్న ముద్రగడ.. పద్మనాభ రెడ్డిగా మారాల్సి వచ్చిందే తప్ప వైసీపీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. నాటి కుల రాజకీయాల ఉచ్చులో పడకుండా పవన్ చాలా చాకచక్యంగా ఎదురొడ్డి నిలిచారు. అయితే, ఇప్పుడు ముద్రగడ, హరిరామ జోగయ్య వంటి పాత ముఖాల స్థానంలో.. సరికొత్తగా కొందరు కాపు నేతలను, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వైసీపీ తన ట్రాప్‌లోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. తెరవెనుక ఉంటూ జనసేనపై కుల ముద్ర వేసేందుకు కొత్త అస్త్రాలను రంగంలోకి దించుతోంది.
ప్రస్తుతం జనసేనను ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ ఒక విచిత్రమైన, రెండంచుల వ్యూహాన్ని నడుపుతోంది. ఒకవైపు జనసేనకు ఉన్న ప్రజాదరణను తగ్గించడానికి.. అది కేవలం ఒకే సామాజికవర్గానికి పరిమితమైన కాపు సేన అంటూ వైసీపీ అధికారిక నేతలు లెక్కలతో సహా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలోని వైసీపీ అనుకూల విభాగాలు మాత్రం.. "జనసేన(janasena)కు దక్కిన ఒకే ఒక్క రాజ్యసభ సీటును కమ్మ సామాజికవర్గానికి కట్టబెడుతున్నారని, పవన్ కాపులను మోసం చేశారని" ఎదురుదాడి చేస్తున్నాయి. అంటే, ఒకరికి కాపు సేనగా చూపిస్తూ.. సొంత సామాజికవర్గానికి మాత్రం పవన్ ద్రోహి అనే కలరింగ్ ఇచ్చేలా వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది.
అయితే వైసీపీ(YCP) వేస్తున్న ఈ సరికొత్త పద్మవ్యూహం పవన్‌ను కట్టడి చేయగలదా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గతంలో కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత పరిణతి సాధించారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ, ప్రజల్లో తన గ్రాఫ్‌ను స్థిరంగా ఉంచుకుంటున్నారు. వైసీపీ ఎంతగా కుల రాజకీయాల ఉచ్చు బిగించాలని చూస్తున్నా.. పవన్ దానిని డెవలప్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్ అనే అస్త్రాలతో తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ ప్లాన్ బి రాజకీయ చదరంగంలో జగన్ అనుకున్నది సాధిస్తారా, లేక గతంలో లాగే పవన్ కళ్యాణ్ ఈ వ్యూహాన్ని కూడా ఛేదించి పైచేయి సాధిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.