రాజకీయంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, ప్రమాదాల్లో సర్వస్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలు చాలా సున్నితంగా ఉండాలి. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బాధితులకు తక్షణ భరోసా ఇవ్వాల్సింది పోయి, భవిష్యత్తు రాజకీయాలను ముడిపెడుతూ ఆయన మాట్లాడిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఒక పెద్ద నాయకుడు పరామర్శకు వస్తున్నాడంటే, బాధితులు తమకు ఏదో ఒక తక్షణ ఆర్థిక సాయం అందుతుందని ఆశిస్తారు. కానీ వైజాగ్(Vizag) పర్యటనలో జగన్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పలకరించి, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు విన్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 'ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమీ చేయకపోయినా.. రాబోయే రోజుల్లో తాము మళ్లీ అధికారంలోకి రాగానే బాధితులందరికీ పూర్తి న్యాయం చేస్తాం' అంటూ జగన్ హామీలు గుప్పించారు. అంటే, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు బాధితులు నిరీక్షించాలా? అప్పటివరకు వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సహాయం చేయడానికి కూడా అధికారం అనే కండిషన్ పెట్టడం ఇదెక్కడి లాజిక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చే రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రస్తావించిన జగన్.. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడం వరకు బాగానే ఉన్నా.. ప్రధాన ప్రతిపక్షంగా, కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్న పార్టీ అధినేతగా వైసీపీ(YCP) తరఫున బాధితులకు కనీస ఆర్థిక సాయం ప్రకటించకపోవడం గమనార్హం. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా సాగిన ఈ ప్రసంగంలో.. మాటల్లో కోట్లు దాటించిన జగన్, చేతల్లో మాత్రం రూపాయి సాయం ప్రకటించకపోవడంపై అక్కడి బాధితుల బంధువులే పెదవి విరుస్తున్నారు.అంతేకాకుండా, చావు బతుకుల మధ్య ఉన్న బాధితుల చెంత.. పార్టీ కటౌట్లు, ప్లకార్డులు పట్టుకుని కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో నినాదాలు చేయించడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రాజకీయం చేయడానికి ఎన్నో వేదికలు ఉంటాయని, కనీసం ఆసుపత్రి మృతుల వద్ద అయినా ఇలాంటి పవర్ పాలిటిక్స్ పక్కన పెడితే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.