రాజకీయాల్లో ఏ పోరాటమైనా సక్సెస్ కావాలంటే సైన్యం కంటే ముందు సేనాపతి నిలబడాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్(YSRCP) పార్టీలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. కూటమి సర్కార్‌ను టార్గెట్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు.. ఇప్పుడు సొంత పార్టీ నేతలకే పెద్ద తలనొప్పిగా మారింది. అధిష్ఠానం వ్యూహాలకు, గ్రౌండ్ రియాలిటీకి అస్సలు పొంతన లేకపోవడంతో మెజారిటీ నియోజకవర్గాల ఇంచార్జులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.
తాజాగా తాడేపల్లిలో ప్రెస్ మీట్ ముగించుకున్న వెంటనే జగన్(Jagan) బెంగళూరు ప్యాలెస్‌కు ప్రయాణం కావడం వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు "రోడ్లెక్కి నిరసనలు తెలపండి" అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసి.. మరోవైపు తానే స్వయంగా పక్క రాష్ట్రానికి వీకెండ్ టూర్‌కు వెళ్ళిపోవడంతో క్యాడర్ అవాక్కయ్యింది. తాము ఇక్కడ ఎండల్లో కొట్లాడుతుంటే, లీడర్ మాత్రం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడమేంటనే అసంతృప్తి పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.
అధినేత రాష్ట్రంలో లేకపోయినా.. తాడేపల్లి(Tadepalli) ఆఫీస్ నుంచి జిల్లాల లీడర్లపై ఒత్తిడి మాత్రం నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. కచ్చితంగా జనాన్ని రోడ్లపైకి తేవాల్సిందే.. ధర్నాలు హోరెత్తించాల్సిందే అంటూ ఐప్యాక్, పార్టీ ముఖ్య నేతల నుంచి నియోజకవర్గాల ఇంచార్జులకు వరుసగా హుకూంలు జారీ అయ్యాయి. అయితే, ఈ బలవంతపు ఆదేశాలపై స్థానిక నాయకులు లోలోపల మండిపడుతున్నారు. ఎన్నికల దెబ్బతో ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ జనాన్ని తరలించడానికి సొంత జేబుల నుంచి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం తమ వల్ల కాదంటూ చాలా మంది నేతలు చేతులెత్తేస్తున్నారు.
అధిష్ఠానం కంటపడితే ఎక్కడ యాక్షన్ తీసుకుంటుందో అనే భయంతో కొద్దిమంది లీడర్లు మాత్రం మొక్కుబడి ప్రదర్శనలతో సరిపెట్టారు. భారీగా జనం రాలేకపోయినా.. ఐదారుగురు కార్యకర్తలతో ప్లకార్డులు పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. క్షేత్రస్థాయిలో నిరసనలు అట్టర్ ప్లాప్ అయినప్పటికీ, తాము సక్సెస్ అయ్యామని చూపించుకోవడానికి పెయిడ్ మీడియా కవరేజీలను నమ్ముకున్నారు. కొన్ని అనుకూల ఛానెళ్లలో ఈ చిన్నపాటి హడావుడిని పెద్దదిగా చూపిస్తూ, తాడేపల్లి(Tadepalli) పెద్దలకు రిపోర్టులు పంపి మమ అనిపించేస్తున్నారు.