డైవోర్స్..రీల్ స్టోరీని మించిన రియల్ స్టోరీ!

admin
Published by Admin — June 14, 2026 in National
News Image

రీల్ కు మించిన రియల్ ఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి ఆసక్తికర అంశాలు వెలుగు చూసినా.. వెంటనే అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్న పరిస్థితి. అలాంటి మానవాసక్తి ఉదంతం ఒకటి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో చోటు చేసుకుంది. ఐదేళ్లుగా కోర్టులో విడాకుల కోసం పోరాటం చేస్తున్న భార్య.. కోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట విడాకుల పత్రాల్ని చించేసి.. పరుగున భర్తకు భారీ హగ్ ఇచ్చిన ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. ఇంతకూ ఏం జరిగింది? విడాకుల కోసం ఐదేళ్లుగా పోరాడుతున్న భార్య.. అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించింది? లాంటి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన శిఖాసింగ్.. సౌరభ్ లకు 2020లో పెళ్లైంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు. భర్త మాత్రం కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి. పెళ్లైన కొద్దిరోజులకు ఇరువురి మధ్య మొదలైన విభేదాలు అంతకంతకూ పెరిగాయి. వ్యక్తిత్వ పరమైన విభేదాలు మరింతగా ముదిరిపోవటంతో.. విషయం కోర్టుకు వెళ్లింది. భర్త మీద వరకట్న వేధింపుల కేసు పెట్టారు. దీంతో ఇరు కుటుంబాల వారు పోలీసు స్టేషన్లు.. కోర్టుల చుట్టూ తిరిగారు.

తన కుమార్తె భర్త మీద పెట్టిన కేసులో గెలిచేందుకు వీలుగా లాయర్లకు భారీగా ఫీజులు చెల్లించేవారు. చివరకు ఆయన తన ఆస్తులు.. జీవితంలో పొదుపు చేసిన డబ్బులు మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేశారు. ఓవైపు కేసు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ఆందోళనకు గురైన ఆయన గుండెపోటుకు గురయ్యారు. మధ్యతరగతికి  చెందిన ఆయన.. కూతురు కోర్టు కేసుల కారణంగా ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిషన్ ఫీజు కూడా చెల్లించలేని దీనస్థితికి చేరుకున్నారు. దీంతో.. గత్యంతరం లేని స్థితిలో ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్చాల్సి వచ్చింది.

మామూలుగా అయితే.. తన మీద అత్యంత కఠినమైన వరకట్న వేధింపుల కేసు పెట్టి కోర్టుకు ఈడ్చిన భార్య మీదా.. ఆమె కుటుంబ సభ్యుల మీదా విపరీతమైన కోపం.. ద్వేషంతో రగిలిపోతూ ఉండాలి. ఇలాంటి దీనస్థితికి చేరినప్పుడు.. ఇతరులు వేరుగా స్పందిస్తారు. కానీ.. మామగారి పరిస్థితి గురించి తెలిసినంతనే సౌరభ్ అసాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు. ఇగోను పక్కన పెట్టేసి.. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మామగారిని గుర్గావ్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రి (మేదాంత)తరలించి సొంత ఖర్చులతో చికిత్స చేయటంతో ఆయన ప్రాణాపాయం తగ్గటమే కాదు.. ఆరోగ్యవంతులయ్యారు.

ఇది జరిగిన తర్వాత కేసు విచారణకు కోర్టుకు హాజరయ్యారు. ఎప్పటిలానే జడ్జి ఇరుపక్షాల వాదనలు వినేందుకు సిద్ధమయ్యారు. అనూహ్య రీతిలో శిఖా సింగ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కన్నీళ్లతో విడాకుల పత్రాల్ని కోర్టు హాల్లో చించేసి.. భర్త వద్దకు వెళ్లి గాఢంగా హత్తుకొని ఏడ్చేసింది. తామిద్దరం కలిసి పోతున్నట్లుగా పేర్కొనటంతో జడ్జితో పాటు తోటి లాయర్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. దంపతుల అవగాహనకు మెచ్చుకున్న జడ్జి కేసులు తక్షణం క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనను ఒకరు ఫోన్ లో రికార్డు చేయటం.. అది వాట్సాప్.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. భర్తలపై పెట్టే తప్పుడు కేసులతో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిస్తే.. అసాధారణ రీతిలో భర్త ప్రదర్శించిన వ్యక్తిత్వం శత్రువు సైతం శభాష్ అనేలా ఉందని చెప్పక తప్పదు.

Tags
wife husband divorce court real life
Recent Comments
Leave a Comment

Related News