ఎన్నికల్లో జనం కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఉంటుందని, కనీసం ఇప్పుడైనా రూటు మారుస్తారని ఆశించిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్లీ పాత రుచే చూపిస్తున్నారు. అధికారం పోయినా అహంకారం పోలేదన్న చందంగా.. వైసీపీ మార్కు నోటి దూల రాజకీయం మళ్లీ మొదలైంది. తాజాగా మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఆ పార్టీ నేతలకు బూతులు, వ్యక్తిగత దూషణలు అనేవి డీఎన్ఏలోనే ఉండిపోయాయేమోననే అనుమానం కలగక మానదు. ఒకప్పుడు ఐటీ శాఖను ఉద్ధరించిన ఈ మాజీ మంత్రి, ఇప్పుడు హోమ్ మంత్రి అనితపై పడి ఏడుస్తూ తన సంస్కారాన్ని బయటపెట్టుకున్నారు.
రాజకీయాల్లో విమర్శలు అంటే పాలసీల మీద, ప్రజా సమస్యల మీద ఉండాలి. కానీ, మన అమర్నాథ్ కి మాత్రం హోమ్ మంత్రి అనిత(Home Minister Anitha) వేసుకునే మేకప్, ఆమె తిరిగే కారు మాత్రమే కనిపిస్తున్నాయి. "ఆమె ఎండలో తిరిగితే కేజీ మేకప్ ఊడిపోతుంది.. నేను వాడి వదిలేసిన బుల్లెట్ కార్ వాడుకుంటోంది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఒక హోమ్ మంత్రిని ఉద్దేశించి, అందులోనూ ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కనీస విచక్షణ ఉండాలనే స్పృహ కూడా కోల్పోయి, చుట్టూ ఉన్న నలుగురు కార్యకర్తలను ఖుషీ చేయడానికి అమర్నాథ్ పాతాళానికి పడిపోయారు. బహుశా వైసీపీ క్యాడర్‌కు ఇలాంటి రోత మాటలు చెబితేనే కానీ ఉత్సాహం రాదేమో.
అయితే, వైసీపీ(YCP) నేతలకు ఇలా మహిళలను టార్గెట్ చేయడం, వారి కట్టు, బొట్టుపై కామెంట్లు చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో అసెంబ్లీ సాక్షిగా, బయట వేదికల మీద కూడా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన ఘన చరిత్ర ఆ పార్టీది. సరిగ్గా ఇలాంటి వికృత రాజకీయాల వల్లే కదా.. మొన్నటి ఎన్నికల్లో జనం వీరికి సింగిల్ డిజిట్ సీట్లు ఇచ్చి ఇంటికి పంపింది? అయినా సరే, బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే పాత పంథాలోనే సాగుతున్నారు.
అమర్నాథ్ చేసిన ఈ నీచమైన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గట్టిగానే క్లాస్ పీకారు. రాజకీయాల్లో విమర్శలు వస్త్రధారణ, అలంకరణల చుట్టూ తిరగడం పతనావస్థకు నిదర్శనమని, ఇది ఒక్క అనితను మాత్రమే కాదు, రాష్ట్రంలోని సగటు మహిళలందరినీ అవమానించడమేనంటూ పవన్ మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ఆ నోటి దురద తగ్గించుకోకపోతే.. మిగిలిన ఆ కాస్త పరువు కూడా గంగలో కలవడం ఖాయం.