తాగి బండెక్కితే కేసే లేదు.. ఏలూరు ఎంపీ సరికొత్త రూల్!

admin
Published by Admin — June 25, 2026 in Politics, Andhra
News Image

రాజ్యాంగంపై ప్రమాణం చేసి, చట్టాల తయారీలో భాగస్వామ్యమయ్యే ఒక పార్లమెంట్ సభ్యుడి నోటి వెంట ఇలాంటి మాటలు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. ఏలూరు(Eluru) వేదికగా జరిగిన అధికారిక సమీక్షా సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్(MP Putta Mahesh Kumar) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికపై, మద్యం తాగి వాహనాలు నడిపేవారికి అనుకూలంగా ఆయన మాట్లాడిన తీరు అందరినీ విస్మయానికి గురిచేసింది.

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన కంటే.. ఎంపీ పుట్టా మహేష్(MP Putta Mahesh) కి రోజువారీగా వస్తున్న ఫోన్ కాల్స్ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయట. రోజుకు సుమారు 30 మందికి పైగా ఫోన్ చేసి.. "సార్, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు పట్టుకున్నారు.. విడిపించండి" అని కోరుతున్నారట. అయితే, ఇలాంటి బాధ్యతారహితమైన పనులను మందలించాల్సిన ఎంపీ.. రివర్స్‌లో పోలీసులపైనే అసహనం వ్యక్తం చేశారు. మందుబాబులపై కేసులు పెట్టడం వల్ల సాక్షాత్తూ ప్రభుత్వానికే బ్యాడ్ నేమ్ వస్తోందని ఆయన వాదించడం గమనార్హం.

సమావేశంలో ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఏలూరు ఎస్పీ కొమ్మి కిషోర్, చట్ట పరిరక్షకుడిగా తన బాధ్యతను గుర్తుచేసే ప్రయత్నం చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారిని వదిలేస్తే రోడ్డు ప్రమాదాలు పెరిగి, అమాయకులు ప్రాణాలు కోల్పోతారని ప్రాక్టికల్‌గా వివరించారు. కానీ, ఎంపీ మహేష్ కుమార్ మాత్రం తన పంథా వీడలేదు. "ప్రమాదాల సంగతి పక్కన పెడితే.. మన పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు కాస్త వెసులుబాటు (flexibility) ఇవ్వాలి" అంటూ పోలీసులకు సరికొత్త రూల్స్ నేర్పించే ప్రయత్నం చేశారు. అస‌లు సమాజంలో క్రమశిక్షణను, చట్ట గౌరవాన్ని పెంచాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ఇక క్షేత్రస్థాయిలో చట్టాన్ని గౌరవించేది ఎవరు?

ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా సమాజానికి క్రమశిక్షణ నేర్పించాల్సిన స్థానంలో ఎంపీ(MP) ఉన్నారు. "తాగి వాహనాలు నడిపితే నాకైనా, మీకైనా చట్టం ఒక్కటే.. నాకు ఫోన్లు చేయకండి" అని ఓటర్లను హెచ్చరించాల్సింది పోయి.. చట్టాన్ని ఉల్లంఘించే వారికి రక్షణ కవచంలా నిలబడతామనడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఈ లెక్కన రేపు మద్యం మత్తులో ఎవరైనా ప్రమాదాలు చేస్తే, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అన్న ప్ర‌శ్న‌లు సామాన్యుల నుంచి వ్య‌క్తం అవుతున్నాయి.

Tags
Eluru Eluru MP Putta Mahesh Kumar Andhra Pradesh AP Politics Eluru Collectorate
Recent Comments
Leave a Comment

Related News