కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతం నేపథ్యంలో కాపులను రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసలు కాపు సామాజిక వర్గానికి ఏ పార్టీ, ఏ నేత ఏం చేశారు? అసలు కాపులకు జగన్ ఏం చేశారు? కాపు సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేసింది ఏ సామాజిక వర్గానికి చెందిన నేతలు అన్న విషయాలు తెరపైకి వచ్చాయి.
బీసీల్లో ఉన్న కాపులను ఆ లిస్ట్ నుండి తొలగించి ఓసీలలో చేర్చింది నీలం సంజీవరెడ్డి. ఆ తర్వాత రెండేళ్లు (1960-62)ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య కాపులను 1961లో తిరిగి బీసీల్లో చేర్చారు. 1966లో ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవ రెడ్డి శిష్యుడు కాసు బ్రహ్మానందరెడ్డి తిరిగి కాపులను బీసీల లిస్ట్ నుండి తొలగించారు.1960 లలో బీసీలకు 25% రిజర్వేషన్ ఉండేది. అప్పటికి బీసీ వర్గీకరణ జరగలేదు.
తిరిగి 53 ఏళ్ల తర్వాత చంద్రబాబు హయాంలో 2019లో కాపులకు బీసీ రిజర్వేషన్ తో సంబంధం లేకుండా కేంద్రం కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% కేటాయించి అసెంబ్లీ తీర్మానం చేయించి కేంద్రానికి పంపారు. అయితే, 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ 2 నెలల్లో అంటే 2019 జూలైలో GO MS No:60 ద్వారా EWS రిజర్వేషన్ అమలులో కాపులకు 5% రిజర్వేషన్లు లేకుండా ఆర్డర్స్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన సీఎంలు ఇద్దరే ఇద్దరు. ఒకరు దామోదరం సంజీవయ్య మరొకరు నారా చంద్రబాబు నాయుడు. చరిత్రలో రాజ్యాంగబద్ధమైన SC,ST,BC కార్పొరేషన్లు కాక OCలకు కూడా కార్పొరేషన్ పెట్టి ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమే. బ్రాహ్మణ కార్పొరేషన్(500cr), కాపు కార్పొరేషన్(2000cr నిధులు)లు ఇచ్చిన చంద్రబాబుకు కమ్మకార్పొరేషన్ పెట్టుకోవాలి అన్న ఆలోచన రాలేదు. అది ఆయన నైజం. కానీ, జగన్ మాత్రం...రెడ్డి కార్పొరేషన్ ,కమ్మ కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్ లు పెట్టి చంద్రబాబుకు, తనకు ఉన్న తేడా చెప్పకనే చెప్పేశారు.5
విదేశీ విద్య పథకం కింద దాదాపు 800 మంది కాపు విద్యార్థినీవిద్యార్థులకు విదేశాలలో చదువుకు గ్రాంట్స్ ఇచ్చింది చంద్రబాబు. కానీ, కమ్మ విద్యార్థులకు కూడా అలా ఇవ్వాలని అనే ఆలోచన చంద్రబాబుకు రాలేదు. 2014-19 మధ్యకాలంలో ఒక ఉపముఖ్య మంత్రి పదవి, 34 MLA పదవులు ఇచ్చిన ఘనత చంద్రబాబుది. సొంత సామాజిక వర్గానికన్నా కాపు కులానికి ఇంత మంచి చేసిన చంద్రబాబు మీద వైసీపీ కాపు నేతలు మీటింగ్ పెట్టుకుని బెదిరింపులకు దిగడం నిజంగా హాస్యాస్పదం.
సమాజంలో జరిగే గొడవలకు కులం రంగు పూసి, కుల విద్వేషాలు రగిలించి, నేరస్తులకు కాపు కాస్తూ, కాపు కులానికి ఏదో అన్యాయం జరిగిపోతున్నదన్న భ్రమలు కల్పించడం వెనుక వైసీపీ నేతల రాజకీయ ఉద్దేశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాపులను మిగిలిన కులాల నుండి వేరు చేయడం ద్వారా సాధించే ప్రయోజనాలు శూన్యం అని వైసీపీ నేతలు గ్రహించాలి. 5 దశాబ్దాల కల అయిన కాపురిజర్వేషన్ ను సాధించిన చంద్రబాబును టార్గెట్ చేసి ఆ రిజర్వేషన్ రద్దు చేసిన జగన్ కు వత్తాసు పలుకుతున్న కాపు సంఘాల నాయకులు, వైసీపీ కాపు నేతలు గతాన్ని ఒకసారి నెమరువేసుకుంటే బాగుంటుంది.