కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. 100కు పైగా సంఘాలకు చెందిన వేలాది మంది సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఏడాది థీమ్ “యోగా ఫర్ హెల్తీ ఏజింగ్” కు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ సహకారంతో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బ్రహ్మ కుమారీస్ మెడిటేషన్ సెంటర్ సిలికాన్ వ్యాలీ, పలు ప్రవాస భారతీయ సహాయక సంస్థలు కలిసి ఈ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాయి.
మిల్పిటాస్‌లోని బ్రహ్మ కుమారీస్ మెడిటేషన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వయో భేదం లేకుండా ఎన్నారైలు పాల్గొన్నారు. యోగా, ధ్యానం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందారు.
కాలిఫోర్నియాలో భారతదేశ డిప్యూటీ కాన్సుల్ జనరల్ శ్రీ రాకేష్ అద్లాఖా, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మాంటానో, ఫ్రెమంట్ మేయర్ రాజ్ సల్వాన్, బ్రహ్మ కుమారీస్ సిస్టర్ కుసుమ్, మిల్పిటాస్ కౌన్సిల్ మెంబర్ విలియం లామ్, మిల్పిటాస్ ప్లానింగ్ కమిషనర్ దీపక్ అవస్తి, ఇండియన్ కమ్యూనిటీ అడ్వకేట్ అజయ్ భుటోరియా, సరటోగా మాజీ కౌన్సిల్ మెంబర్ రిషి కుమార్, ఎయిర్ ఇండియా నుంచి బామా కారియప్ప, యు.ఎస్. కాన్సులేట్ జనరల్ దుబాయ్ నుంచి వందనా నాయర్, ఆత్మ దయాల్ భాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బే ఏరియాలో యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తి ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగా కనిపించింది.
ఈ కార్యక్రమంలో సిస్టర్ కుసుమ్ ధ్యానం నిర్వహించగా, మనోజ్ జోషి మరియు అంబిలి సుధాకరన్ యోగా సెషన్లు నిర్వహించారు. యోగాలో అనుభవం లేని వారి నుంచి అనుభవజ్ఞుల వరకు అందరూ చేయగలిగే రీతిలో ఉండేలా యోగాసనాలు వేశారు. శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిస్థాపకత, మైండ్‌ఫుల్‌నెస్ మరియు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం ప్రత్యేకంగా రూపొందించిన యోగాసనాలు వేశారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) కో-హోస్ట్‌గా వ్యవహరిస్తూ వెల్‌నెస్, సాంస్కృతిక అవగాహన, సమాజ సేవలను ప్రోత్సహించడంలో తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. యోగాను కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా, సమగ్ర ఆరోగ్యం, అంతర్గత శాంతి మరియు సామరస్యం అందించి అద్భుతమైన ప్రక్రియగా ప్రపంచం గుర్తించిందని వక్తలందరూ అభిప్రాయపడ్డారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు బలమైన సమాజాలను ఏర్పరచ వచ్చని ఈ కార్యక్రమం రుజువు చేసింది. బే ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రతి ఏటా ప్రాచుర్యం పెరుగుతోంది అనేందుకు ఈ ఈవెంట్ ఒక నిదర్శనం.