సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి కథ కంటే కూడా ఆ సినిమాకు పెట్టే టైటిలే ఎక్కువ అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్‌లో ‘ఇడుపు కాయితం’ అనే పేరు ఇలాంటి సంచలనానికే తెరలేపింది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ కలయికలో ప్రియదర్శి(Priyadarshi), నాగదుర్గ హీరో హీరోయిన్లుగా ఓ కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్ ముఖ్యఅతిథిగా వచ్చి క్లాప్ కొట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. అయితే, సినిమా ఓపెనింగ్స్ హడావిడి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో మాత్రం ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌పై పెద్ద చర్చే నడుస్తోంది.
చాలా మందికి ఈ పదం వినగానే కొత్తగా, కాస్త వింతగా అనిపించవచ్చు. ‘ఇడుపు కాయితం(Idupu Kaitham)’ అంటే మరేదో కాదు.. ఒకప్పటి అనధికార విడాకుల పత్రం. దశాబ్దాల క్రితం తెలంగాణలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో ఈ సంప్రదాయం ఉండేది. భార్యాభర్తలు మనస్పర్థల వల్ల కలిసి బతకలేము అనుకున్నప్పుడు.. కోర్టుల చుట్టూ తిరగకుండా, పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో ఒక కాగితం రాసుకుని విడిపోయేవారు. దాన్నే మాండలికంలో ఇడుపు కాయితం(విడిపోయే పత్రం) అనేవారు. కాలక్రమేణా చట్టాలు, కోర్టులు రావడంతో ఈ పద్ధతి పూర్తిగా కనుమరుగైపోయింది.
ఈ కాలంలో ఎవరికీ పెద్దగా పరిచయం లేని, అదీ ఒకప్పటి విడాకుల(Divorce)కు సంబంధించిన పాత మాండలికాన్ని టైటిల్‌గా పెట్టడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అర్థం కాని ఇలాంటి పేర్లు ఎందుకు?" అని కొందరు ప్రశ్నిస్తుంటే.. "ఒక ప్రాంతానికే పరిమితమైన పాత పద్ధతిని ఇప్పుడు సినిమా పేరుగా పెట్టాల్సిన అవసరం ఏముంది?" అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రాకముందే, కేవలం టైటిల్ అనౌన్స్మెంట్‌తోనే ఈ రేంజ్‌లో వివాదం రేగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
నిజానికి ఈ రచ్చ సినిమాకు ఒక రకంగా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమా షూటింగ్ మొదలైన మొదటి రోజే ‘ఇడుపు కాయితం’ అంటే ఏంటా అని గూగుల్‌లో వెతికేలా ఈ టైటిల్ జనాల్లో క్యూరియాసిటీని పెంచింది. అసలు కథేంటో తెలియకుండా కేవలం పేరును బట్టి నెగిటివ్ కామెంట్లు చేయడం సరికాదనే వాదనలు కూడా ఉన్నాయి. సుకుమార్(Sukumar) శిష్యుడైన వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా ఒక బలమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతోనే తెరకెక్కుతోందని ఇండస్ట్రీ టాక్.