ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చకు తెరపడింది. మరో నాలుగు రోజుల్లో సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్ కాబోతున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి(IAS Srilakshmi)కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఊహించని రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చింది. గత రెండేళ్లుగా ఎలాంటి లూప్ లైన్ పోస్టింగ్ కూడా లేకుండా, వెయిటింగ్‌లోనే ఉండిపోయిన ఆమెను.. పదవీ విరమణకు సరిగ్గా నాలుగు రోజుల ముందు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తన సుదీర్ఘ ఐఏఎస్ ప్రస్థానాన్ని అత్యున్నత హోదాలో, గౌరవప్రదంగా ముగించేందుకు మార్గం సుగమమైంది.
నిజానికి అఖిల భారత సర్వీస్ (AIS) నిబంధనల ప్రకారం.. ఒక అధికారి సస్పెన్షన్‌లో లేనప్పుడు, వారి రిటైర్మెంట్‌కు ముందు ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ పోస్టింగ్ లేకుండానే రిటైర్ అయితే, సదరు అధికారికి ఆర్థికంగా పెద్ద నష్టం జరగకపోయినా, రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, నో-డ్యూ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది ఏ అధికారినికైనా కెరీర్ చివర్లో తీవ్ర అవమానకరంగా మారుతుంది. ఈ సాంకేతిక ఇబ్బందులను గమనించిన చంద్రబాబు సర్కార్.. నిబంధనలను పాటిస్తూనే శ్రీలక్ష్మికి ఈ కీలక నియామకాన్ని ఖరారు చేసింది.
ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఒక వ్యూహాత్మక రాజకీయ, పరిపాలనాపరమైన సంకేతాన్ని పంపినట్లు బ్యూరోక్రసీలో చర్చ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీలక్ష్మి అత్యంత కీలకమైన పదవుల్లో చక్రం తిప్పారు. ఆ కారణంగానే కూటమి ప్రభుత్వం రాగానే ఆమెను పక్కన పెట్టారనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఆమెకు గౌరవప్రదమైన వీడ్కోలు పలకడం ద్వారా.. తాము అధికారులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, కేవలం నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని చంద్రబాబు స్పష్టం చేసినట్లయింది. ఇది ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచేలా చేసింది.