ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. గత ఎన్నికల ఓటమి తర్వాత సైలెంట్‌గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు రూట్ మార్చారు. 2029 ఎన్నికలను టార్గెట్ చేస్తూ సరికొత్త పొలిటికల్ అస్త్రాన్ని సంధించారు. ఇప్పటివరకు 'మూడు రాజధానుల' చుట్టూ తిరిగిన ఏపీ రాజకీయాన్ని, ఇప్పుడు అకస్మాత్తుగా 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) వైపు మళ్లించి సరికొత్త చర్చకు తెరలేపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ అమరావతికి, మావిగన్‌కు మధ్యేనంటూ ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గత ఐదేళ్లూ విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అంటూ మూడు ప్రాంతాల నినాదాన్ని బలంగా వినిపించిన జగన్, ఇప్పుడు రూట్ మార్చి కేవలం 'మావిగన్(Mavigan)' ప్రాంతంపైనే ఎందుకు ఫోకస్ పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటంతో, దానికి కౌంటర్‌గా భౌగోళికంగా అదే పరిధిలోకి వచ్చే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను కలిపి సరికొత్త ఈక్వేషన్‌ను తెరపైకి తెచ్చారు. అవినీతికి తావులేకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెబుతూ.. వ్యూహాత్మకంగా తన పాత పంథా నుంచి యూటర్న్ తీసుకున్నారనే విమర్శలు వస్తున్నా, జగన్ మాత్రం దీనినే తన తదుపరి ఎన్నికల ఎజెండాగా ఫిక్స్ చేసుకున్నారు.
అయితే మూడు రాజధానుల ముచ్చటను పక్కనబెట్టడం ద్వారా.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు గతంలో ఇచ్చిన మాటను జగన్ తప్పినట్లయిందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో కేవలం నినాదాలతోనే కాలం గడిపేస్తే ప్రజలు నమ్ముతారా? అనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న అమరావతికి భిన్నంగా జగన్(Jagan) ప్రతిపాదిస్తున్న 'మావిగన్' ప్లాన్ ఏంటి? దానికి సంబంధించిన నిర్దిష్ట రోడ్ మ్యాప్ గానీ, నిధుల సమీకరణ వివరాలు గానీ లేకుండా కేవలం మాటలతోనే 2029 ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సెంటిమెంట్‌ను, ప్రాంతీయ వైరుధ్యాలను రెచ్చగొట్టేందుకే ఈ కొత్త పదాన్ని వాడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్న వేళ.. ఈ సరికొత్త వ్యూహం జగన్ రెడ్డిని మళ్లీ అధికార పీఠం వైపు నడిపిస్తుందా, లేక గతంలో లాగే ఓటర్లు షాక్ ఇస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.