ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడి 2024 ఎన్నికల్లో నభూతో న భవిష్యత్ అన్న రీతిలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు పార్టీల కలయికతో వైసీపీని చావు దెబ్బ కొట్టి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే సీట్ల సర్దుబాటు, పదవుల పంపకాలు వంటి విషయాల్లో మూడు పార్టీల నేతలలో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. పలు సమీకరణాల నేపథ్యంలో అందరికీ న్యాయం చేయడం ఇటు సీఎం చంద్రబాబుకు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సాధ్యం కాకపోవచ్చు.
అసంతృప్త నేతలకు నచ్చజెబుతూ వారిని బుజ్జగిస్తూ ఈ ఇద్దరు నేతలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కానీ, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ తనకు మంత్రి పదవి రాలేదు అంటూ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కిన వైనం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథి వంటి నేతలకు మంత్రి పదవులు ఇచ్చారని వాసంశెట్టి సుభాష్, సవిత, కొండపల్లి శ్రీనివాస్ వీరంతా ఎవరని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి.
2019-24 మధ్యకాలంలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా తాను పార్టీ కోసం ఎంతో శ్రమించానని, తాను ఏం చేశానో అందరికీ తెలుసు అని ఉమా అన్నారు. మాచర్లతో పాటు గుడివాడలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, అయినా వెన్ను చూపకుండా పార్టీ కోసం పోరాడానని ఉమా అన్నారు. అయితే, మంత్రి పదవుల విషయంలో ఇబ్బందులుంటాయని, పార్టీలో ఇటువంటివి సహజమని చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఉమా చెప్పారు . అదే విధంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలు, తన అనుచరులు గౌరవించి ముందుకు సాగాలని కోరారు.