ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. అఖిలప్రియ సంచ‌ల‌నం!

admin
Published by Admin — July 08, 2026 in Politics, Andhra
News Image

ఆళ్లగడ్డ రాజకీయం మరోసారి హీటెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో నంద్యాల జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అహోబిలం క్షేత్రం సాక్షిగా సాగుతున్న ఈ పొలిటికల్ వార్‌లో.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) సంచలన సవాల్ విసిరారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే, నిమిషాల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైకాపా మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దీంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అహోబిలం మఠంలో తలనీలాల కేటాయింపుల అంశంపై గత కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగ‌తి తెలిసిందే. మఠం వ్యవహారాల్లో అఖిలప్రియ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గంగుల బ్రిజేంద్రరెడ్డి(angula Brijendra Reddy) ఆరోపణలు గుప్పించారు. ఈ విమర్శలపై భూమా అఖిలప్రియ అంతే ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, దమ్ముంటే అహోబిలం క్షేత్రానికి వచ్చి ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఒకవేళ తప్పు నిరూపిస్తే పదవి నుంచి తప్పుకుంటానని, లేదంటే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమె నేరుగా అహోబిలానికి చేరుకున్నారు.

మరోవైపు అఖిలప్రియ సవాల్‌ను స్వీకరిస్తూ గంగుల బ్రిజేంద్రరెడ్డి కూడా ఆళ్లగడ్డ(Allagadda) నుంచి అహోబిలం బయలుదేరారు. దీంతో ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అప్రమత్తమయ్యారు. అహోబిలం వైపు వెళ్తున్న గంగుల బ్రిజేంద్రరెడ్డిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని నిలిపివేశారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ, అహోబిలం పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Tags
Bhuma Akhila Priya Gangula Brijendra Reddy Allagadda Politics Ahobilam Temple Controversy Andhra Pradesh AP Politics
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News