కాపు ఉద్యమ నాయకుడు, సీనియర్ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మంగళవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో ఆసుపత్రిలోనే కన్నుమూ శారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా.. గత రెండు మాసాల కిందటే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను కుమారుడు గిరి ఆసుపత్రిలో చేర్చారు. అప్పటినుంచి ఆయన ఐసీయూలోనే చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
కిర్లంపూడిలో విషాధ ఛాయలు..
ముద్రగడ పద్మనాభం ఇక, లేరన్న వార్తతో ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి విషాధ ఛాయలు అలు ముకున్నాయి. పద్మనాభం ఇంటికి అభిమానులు తరలి వచ్చారు. మరోవైపు.. కాపు నాయకులు కూడా ముద్రగడ ఇంటికి క్యూకట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గతంలోనే తెలిసినప్పుడు ఇక్కడ నుంచి కొందరు తరలి వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారని.. ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నామని ఇప్పుడు వారంతా గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. కాపుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని మరికొందరు గుర్తు చేసుకున్నారు.
తండ్రి మరణంతో రాజకీయాల్లోకి..
ముద్రగడ పద్మనాభం తండ్రి వీరరాఘవరావు.. 1970లలో యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. అయితే.. ఆయన 1977లో హఠా న్మరణం చెందారు. దీంతో అప్పటిరాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచనలతో పద్మనాభం రాజకీయ అరంగేట్రం చేశారు. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. గిరిజనులు, నిరుపేద బీసీలు పద్మనాభంలో అతని తండ్రిని చూసుకున్నారు. అలా మొదలైన పద్మనాభం రాజకీయ ప్రస్థానంలో మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
గత ఎన్నికలకు ముందు..
గత 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతు పలికిన ముద్రగడ.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు.. తాను ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక పోతే.. పేరు మార్చుకుంటానన్నారు. అయితే.. పిఠాపురంలో 76 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో పవన్ విజయం దక్కించుకున్నారు. దీంతో తాను చేసిన ప్రతిజ్ఞ మేరకు పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఇక, తన కుమారుడు గిరిని రాజకీయంగా పెద్దవాడిని చేయాలన్న ఆశలు తీరలేదు. మరోవైపు.. ఆయన కుమార్తె క్రాంతి తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా వేరే పార్టీలో చేరారన్న వాదన వినిపించారు.