కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ ప్రాజెక్టులకు నిధులు రాబట్టాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి ఇతర ప్రాజెక్టుల వరకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని.. వీటిని ప్రశ్నించి, తీసుకురావాలని, అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి చేయాలని కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వరకు కేంద్రం నుంచి సాయాన్నిరాబట్టాలని ఆయన సూచించారు.
ఈ నెల 20 నుంచి పార్లమెంటువర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సమావేశాల్లో తెలంగా ణ ఎంపీలుగా అనుసరించాల్సిన విధానంపై సీఎం దిశానిర్దేశం చేశారు. మెట్రో రైలు విస్తరణకు సంబంధించి అప్పు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్న ఆయన. సభలో ఈ విషయాన్ని ప్రస్తావించాలన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ సహా.. తుమ్మిడిహట్టికి అనుమతి వరకు ప్రస్తావించాలని. సూచించారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సహకారం అత్యంత కీలకమని పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే.. ఎలాంటి భేషజాలకు పోకుండా కృతజ్ఞతలు చెబుతామన్నారు.
బీజేపీ ఎంపీలకు రాష్ట్ర సమస్యలపై బాధ్యత లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన సమ స్యలను పార్లమెంటులో ప్రస్తావించి.. నిధులు తీసుకువచ్చే విషయంలో బీజేపీ ఎంపీలు కూడా సహకరించాలని ఆయన సూచిం చారు. ఫ్యూచర్ సిటీ నుంచి మెట్రో విస్తరణ, బుల్లెట్ ట్రైన్.. ఇలా అనేక అంశాల్లో కేంద్రం సహకరించాల్సి ఉందన్నారు. కానీ బీజేపీ ఎంపీలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టుల విషయంపై ఎన్‌డీఎస్ చెబుతున్న ప్రకారమే ముందుకు సాగుతున్నా మని తెలిపారు. తుమ్మిడి హట్టి విషయంలో ఎన్‌డీఎస్ హెచ్చరికలు పాటించామన్నారు.
రాజకీయాలు వద్దు!
పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణసమస్యలను ప్రతిబింంబించేలా ఎంపీలు వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. ముందు రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజకీయాలు వద్దని.. అవసరమైతే.. బీజేపీ నాయకులకు పార్లమెంటులో కేటాయించిన కార్యాలయాలకు వెళ్లైనా.. సమస్యలపై కలుపుకొని ముందు కు సాగాలని సూచించారు. పార్లమెంటులో తెలంగాణ తరఫున గళంవినిపించే బాధ్యత కేవలం కాంగ్రెస్ ఎంపీలపైనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. పార్లమెంటులో మనం(కాంగ్రెస్ ఎంపీలు) ఏం చేస్తున్నామో.. ప్రజలు గమనిస్తారని అన్నారు.