ఆ కేసులో చంద్రబాబుకు ఊరట

admin
Published by Admin — July 15, 2026 in Andhra
News Image

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏ రోజుకైనా నిజం బయటకు వస్తుందని, చంద్రబాబు పలుకడిగిన ముత్యంలా ఆ కేసుల నుంచి బయటపడతారని టీడీపీ నేతలు గతంలో ధీమా వ్యక్తం చేశారు. వారు అన్నట్లుగానే స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసులను విజయవాడ ఏసీబీ కోర్టు గతంలోనే కొట్టివేసింది. అంతేకాదు, స్కిల్ కేసులో చంద్రబాబుపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని ఈడీ కూడా తేల్చింది. ఈ క్రమంలోనే మరో కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. 

అమరావతి అసైన్డ్ భూముల కేసులు సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారాయణలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన సీఐడీ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుల‌కు సంబంధించి స‌రైన ఆధారాల‌ను చూపించ‌లేక పోయార‌ని.. ప్రాసిక్యూ ష‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోర్టు.. ఈ కేసుల‌ను కొట్టి వేస్తున్న‌ట్టు పేర్కొంది. దీంతో సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ‌కు భారీ ఊర‌ట ల‌భించినట్లయింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు తెలిపాయి.

ఏంటి కేసు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి.. రైతులు 33 వేల ఎక‌రాల భూముల‌ను ఇచ్చారు. అయితే.. ఈ స‌మ‌యంలో కొన్ని అసైన్డ్ భూముల‌ను స‌ద‌రు చ‌ట్టం నుంచి త‌ప్పించారు. దీనికి గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసి.. ప్ర‌త్యేకంగా జీవో కూడా ఇచ్చింది. అయితే.. ఈ భూముల‌ను త‌మ సొంతానికి వినియోగించు కునేందుకు వీలుగా చ‌ట్టాన్ని మార్పు చేశారంటూ.. అప్ప‌టి మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు ఆళ్ల‌రామ‌కృష్ణారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అప్ప‌టికే వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డంతో ఈ కేసును సీఐడీ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకుని విచార‌ణ చేశారు. కేసులు కూడా క‌ట్టారు. అనంత‌రం.. రెండు సార్లు ఈ కేసులు హైకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చాయి. వీటిపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని అప్ప‌ట్లో విచార‌ణ అధికారులు తెలిపారు. అయితే.. ఇది వైసీపీ హ‌యాంలో ముందుకు సాగ‌లేదు. త‌ర్వాత‌.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చింది. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఈ కేసులో ఎలాంటిఆధారాలు లేవ‌ని పేర్కొంటూ సీఐడీ పోలీసులు.. హైకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు.

మ‌రింత లోతుగా విచారించాల‌ని కోర్టు సూచించింది. ఆ త‌ర్వాత‌.. కూడా ఎలాంటి ఆధారాలు లేవ‌ని చెప్ప‌డంతో .. తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో ఆధారాలు సేక‌రించ‌డంలో విప‌ల‌మ‌య్యార‌ని పేర్కొంటూ హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. అయితే.. ఈ కేసు విచార‌ణ‌లో తాము స‌హ‌క‌రిస్తామంటూ.. ఆళ్ల త‌ర‌ఫు న్యాయ‌వాది గ‌తంలో అఫిడ‌విట్ వేయ‌గా.. తాజాగా దానిని ఆయ‌న ఉప‌సంహ‌రించుకున్నారు. ఈ నేప‌థ్యంలో కేసును కొట్టి వేయ‌డం గ‌మ‌నార్హం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక మరియు లిక్కర్ కేసులలో చంద్రబాబు ముందస్తు బెయిల్ మీద ఉన్నారు. ఆ కేసుల నుంచి కూడా త్వరలోనే ఆయన బయటపడతారని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

Tags
cm chandrababu high court amaravati assigned lands case reliefe case dismissed
Recent Comments
Leave a Comment

Related News