ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. పవన్‌కు చిన్న ఇబ్బంది కలిగినా వీరు ఓర్చుకోలేరు. గత నెలలో ముక్కుకు ఆపరేషన్ జరిగినప్పుడు కొందరు అభిమానులు ఆలయాల్లో పూజలు చేయించి పవన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక, తాజాగా పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పరామర్శల వెల్లువ పెరుగుతోంది.
మరోవైపు అభిమానులు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని.. ఆరేషన్ గాయం త్వరగా మానాలని కోరుకుంటూ.. ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. ఇలాంటి వారిలో ఈశ్వర్ అనే అభిమాని మరింత ప్రత్యేకత చాటుకున్నారు. దీక్షా వస్త్రాల్లో ఉన్న ఈశ్వర్.. పవన్ కల్యాణ్ ఆరోగ్యం మెరుగు పడాలని, ఆయన కుడి భుజానికి జరిగిన ఆపరేషన్ గాయం త్వరగా మానాలని కోరుకుంటూ.. ఏకంగా పొర్లు దండాలు పెట్టారు. తిరుమలలోని ప్రసిద్ధ జాపాలి తీర్థం సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన ఈశ్వర్ ఇక్కడ పొర్లు దండాలు పెట్టారు.
పొర్లు దండాలతోనే మెట్లు అధిరోహించి.. ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించారు. పవన్ కల్యాణ్ తరఫున ప్రత్యేక పూజలు చేయించారు. తన అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ఈశ్వర్ చెప్పారు. ప్రజా సేవలో పవన్ కల్యాణ్ తిరిగి సాధారణంగా పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా.. ఈశ్వర్ వెంట పలువురు పవన్ కల్యాణ్ అభిమానులు కూడా వచ్చారు. ఆయన పొర్లు దండాలు పెడుతున్న సమయంలో వెనుక నుంచి సాయం అందించారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఆలయాల్లో పూజలు చేశారు. పిఠాపురంలోని పురహూతికా అమ్మవారి ఆలయంలోనూ పవన్ కల్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు రెండు రోజలు కిందటే పూజలు చేయించిన విషయం తెలిసిందే.