ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోనే రాష్ట్రాభివృద్ధి వేగంగా జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)తో కూడిన ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులు తేబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0'ను కేబినెట్ ముందుకు తీసుకురావాలని, సంబంధిత మార్గదర్శకాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పర్యాటకంతోపాటు వివిధ రంగాల్లో రూ.1,23,229 కోట్ల విలువైన 260 ప్రాజెక్టులు పీపీపీ విధానంలో పురోగతిలో ఉన్నాయని చంద్రబాబుకు అధికారులు తెలిపారు.
పీపీపీ కింద చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణ విధానాన్ని కేంద్రం ప్రశంసించిందని, ఆ ప్రాజెక్టులకు రూ.1,468 కోట్ల వీజీఎఫ్ రానుందని తెలిపారు. అలాగే, విజయవాడ, తిరుపతిలోని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు కేంద్రం రూ.178 కోట్ల వీజీఎఫ్ అందిస్తోందని అన్నారు. ప్రతీ ప్రాజెక్టును ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా సస్టెయినబుల్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల వద్ద మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రభుత్వం వద్ద నిరుపయోగంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మార్చుకోవాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని బస్టాండ్ల వద్ద ఉన్న భూములను వాణిజ్యపరంగా వినియోగించుకోవాలని సూచించారు. బలహీన వర్గాల విద్యార్థులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు, రెసిడెన్షియల్ హాస్టళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.