రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటివరకు ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత సడన్‌గా యాక్టివ్ పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) మాజీ ఎంపీ విజయాసాయిరెడ్డి రూట్ మార్చారా? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బలమైన ప్రశ్న ఇది. రాజకీయాల జోలికే వెళ్ళనని ప్రకటించిన ఈ సీనియర్ నేత, ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం, అది కూడా ఢిల్లీ స్థాయి పరిణామాలపై స్పందించడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనే టాక్ నడుస్తోంది.
ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)ను ఉప ప్రధాని చేయబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఎవరూ పెద్దగా నోరు మెదపకపోయినా, విజయసాయిరెడ్డి మాత్రం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. అమిత్ షాను ఏకంగా దేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చుతూ సాయిరెడ్డి ఆకాశానికెత్తేశారు. అమిత్ షాకు ఆ పదవి దక్కితే స్వాగతించాల్సిందేనంటూ ఆయన చేసిన కామెంట్లు, కేవలం అభినందనలు మాత్రమే కాదని, దీని వెనుక భారీ పొలిటికల్ ఇంట్రెస్ట్ దాగుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి(Vijaysai Reddy) కాషాయ దళానికి దగ్గరవ్వాలని చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఢిల్లీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకే ఆయన ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు సైతం ఇది పక్కా బీజేపీ భజనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. తనపై ఉన్న పాత కేసుల నుంచి ఊరట పొందడానికే, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల గుడ్ బుక్‌లో పడేందుకు సాయిరెడ్డి ఇలా రూట్ మార్చుకున్నారనే చర్చ నడుస్తోంది.
ఒకవేళ విజయసాయిరెడ్డి అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోవాలని అనుకున్నా, అది అంత ఈజీ కాదనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ(BJP), తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో ఉంది. గతంలో కూటమి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సాయిరెడ్డిని చేర్చుకోవడానికి లోకల్ లీడర్లు సుముఖంగా లేరని సమాచారం. ముఖ్యంగా టీడీపీ, జనసేనలు ఆయన ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భోగట్టా. అయితే, అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుంటే రాష్ట్ర నేతల అభ్యంతరాలను పక్కన పెట్టవచ్చనే ఆలోచనలో సాయిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. రాజకీయాలకు దూరంగా ఉంటానన్న సాయిరెడ్డి, ఇప్పుడు మళ్లీ ఢిల్లీ రాజకీయాలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.