తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన శపథం చేశారు. తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నంత వరకు బీఆర్ ఎస్ అధికారంలో కి రాదని ఉద్ఘాటించారు. కేసీఆర్‌కు ఎట్టి పరిస్థితిలోనూ అధికారం దక్కదని అన్నారు. బీఆర్ ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకు లు కానీ.. అధికారంపై వ్యామోహాన్ని వదులు కోవాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజా గాయకుడు, కవి అందెశ్రీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందెశ్రీ స్మారకార్థం నిర్మించనున్న పార్కుకు ఆయన శంకు స్థాపన చేశారు.
ఉద్యమకారులపై ఉక్కుపాదం..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ ఉద్యమ కారుల చొరవతో రాష్ట్రం ఏర్పడిందో.. ఏ ఉద్యమంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. ఉద్యమకారులపైనే లాఠీలు ప్రయోగించారని అన్నారు. ముఖ్యంగా ప్రజా కవి గద్దర్ సహా.. అందెశ్రీని సైతం అవమానించారని పేర్కొన్నారు. కేసీఆర్ ను కలుసుకునేందుకు తెలంగాణ భవన్‌కు వెళ్లిన గద్దర్‌ను ఎర్రటి ఎండలో నిలబెట్టి అవమానానికి గురి చేశారని ఆరోపించారు. అలాంటి గడీల మనస్తత్వం.. పాలకులు మనకు అవసరం లేదని తేల్చి చెప్పారు.
మీరు నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు..
కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టి యువ సంగ్రామ సదస్సు పైనా సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీఆర్ ఎస్ హయాంలో 10 సంవత్సరాల్లో ఒక్క నోటిపికేషన్ కూడా ఇవ్వలేదని.. నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఏకదమ్‌గా 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తర్వాత.. విడతల వారీగా 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా.. దొరల అహంకారం మాత్రం వాటిని ఒప్పుకోని వ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు పొందిన వారి కుటుంబాలను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని తేల్చి చెప్పారు.
అందెశ్రీ నా ఆత్మ బంధువు
ఈ సందర్భంగా ప్రజాకవి అందెశ్రీ తనకు ఆత్మబంధువని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ``దొరల గడీల ముందు మోకరిల్లనని ధైర్యంగా చెప్పిన కవి అందెశ్రీ`` అని వ్యాఖ్యానించారు. అందెశ్రీని గత ప్రభుత్వం ప్రోత్సహించి ఉంటే ఆయన జాతీయస్థాయిలో రాణించిఉండేవారని .. తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి సైతం చాటేవారని తెలిపారు. కానీ, నాటి ప్రభుత్వం, దొరలు.. అందెశ్రీని నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. గద్దర్, అందెశ్రీలను అవమానించినప్పుడే దొరలను సాగనంపాలని తెలంగాణ సమాజం నిర్ణయించుకుందన్నారు. ``నేను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నంతవరకు మరోసారి మీ సర్కారును రానివ్వను. తెలంగాణను దోచుకోవాలని చూస్తే.. అందెశ్రీ మళ్లీ పాటై పుడతాడు`` అని సీఎం ఉద్ఘాటించారు.