`రా..ఎన్టీఆర్` పేరుతో `ఊరూ వాడ` కార్యక్రమానికి డిజైన్ చేసి.. కొన్ని రోజులుగా రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన.. జూనియర్ ఎన్టీఆర్.. తారక్ అభిమాన సంఘం తాజాగా ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్ అంటే తమకు ఎంతో గౌరవమని.. ఆయన పేరును అడ్డు పెట్టుకుని ఎవరినీ మోసం చేయలేదని పేర్కొంది. అంతేకాదు.. తారక్ సూచనల మేరకే తాము రంగంలోకి దిగినట్టు రా.. ఎన్టీఆర్ సంస్థ ఫౌండర్.. సాయి రూప్ స్పష్టం చేశారు.
ఆయన స్ఫూర్తితోనే.. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు సాయిరూప్ పేర్కొన్నారు. తారక్ అభిమానులు, అభిమాన సంఘాలు చేసిన విధంగా ఇతర సంఘాలు సేవలు చేయలేదన్నారు. ఈ క్రమంలోనే వినూత్న రీతిలో సేవ చేయాలన్న ఉద్దేశం తోనే.. తారక్ గతంలో చెప్పిన మేరకు తాము ఊరు-వాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అయితే.. ఇది ఎందుకు రాజకీయం అయిందో తమకు కూడా అర్థం కావడం లేదని తెలిపారు.
తనపై తీవ్ర ఆరోపణలు చేయడం.. సోషల్ మీడియాలో పనిగట్టుకుని ప్రచారం చేయడం వంటివి బాధించాయన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధం ఉందా? రా.. ఎన్టీఆర్ సంస్థకు సంబంధించి ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో విడుదలైన లేఖపై సాయిరూప్ అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆయనకు అభిమాన సంఘం గురించితెలుసా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆదేశాలతోనే తమకు వ్యతిరే కంగా లేఖ విడుదల చేశారా? అని సందేహం వ్యక్తం చేశారు.
``ఎన్టీఆర్‌కు సంబంధం లేకుండా మాకు వ్యతిరేకంగా లేఖ విడుదల అయినట్లు అనుమానిస్తున్నాం. మాకు కూడా ఈ విషయం అర్ధం కాలేదు. ఒక వేళ ఎలాంటి సేవా కార్యక్రమాలు వద్దని ఎన్టీఆర్ స్వయంగా చెబితే.. ఈ పనులు ఆపేస్తాం. కానీ, ఆయన అభిమానులుగా ఎన్టీఆర్‌కు చెడ్డపేరు తీసుకురాం`` అని సాయి రూప్ స్పష్టం చేశారు.