దేశవ్యాప్తంగా నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతం తీవ్ర రాజకీయ తుఫానును సృష్టిస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు ఏకమై ఉద్యమిస్తున్నాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంకేతో పాటు విజయ్ నేతృత్వంలోని టీవీకే వరకు కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వచ్చి, చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఇంతటి సంచలన అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల కీలక ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీలు వహిస్తున్న మౌనం ఇప్పుడు పెద్ద పొలిటికల్ సస్పెన్స్‌గా మారింది.
తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ను నిత్యం ఎండగట్టే బీఆర్ఎస్, అలాగే కేంద్రంలో బీజేపీతో భావజాల పరమైన విభేదాలు ఉన్నాయని చెప్పుకునే వైఎస్సార్‌సీపీ.. ఈ రెండు పార్టీలు నేషనల్ సమస్య అయిన నీట్ వివాదంపై పెద్దగా నోరు మెదపకపోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి ఘాటైన ప్రకటనలు చేయకపోవడం వెనుక ఏ రకమైన వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తమకు రాజకీయ ప్రత్యర్థులేనని పదే పదే చెప్పే బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ ఆత్మరక్షణలో పడిన సమయంలో సైలెంట్‌గా ఉండడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య తెరవెనుక ఏదో రహస్య ఒప్పందం కుదిరిందని, అందుకే బీఆర్ఎస్ నోటికి తాళాలు పడ్డాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్(Jagan) వైఖరి కూడా దాదాపు ఇలాగే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాబోయే రాజకీయ అవసరాలు, ఢిల్లీ(Delhi) స్థాయి సమీకరణాలు, లేదా అంతర్గత వ్యూహాలే ఈ రెండు పార్టీలను సైలెంట్ మోడ్‌లోకి నెట్టేశాయా? లేక వ్యూహాత్మకంగానే ఈ వివాదం నుండి దూరంగా ఉంటున్నాయా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కానీ, విద్యార్థుల ఆందోళనల నడుమ ఈ కీలక నేతల మౌనం మాత్రం తెలుగు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.