తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ సంధించారు. ప్రస్తుత దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు తాము మద్దతు ఇస్తున్నామన్నారు. అసలు ఈ సమస్యకు కారణం.. కేంద్రం విద్యావ్యవస్థలోకి జొరబ డడమేనని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రాల పరిధిలో ఉన్న వైద్య విద్య ప్రవేశాలను కేంద్రం గుంజుకుందని.. నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. నీట్ పరీక్ష వద్దని అనేక రాష్ట్రాలు కేంద్రానికి అనేక సందర్భాల్లో మొర పెట్టుకున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు ముందుందని తెలిపారు.
విద్యార్థులను అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్న నీట్(వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే జాతీయ పరీక్ష)ను రద్దు చేయాలని విజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నీట్ వంటి పరీక్షల ద్వారా విద్యార్థుల్లో ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించి.. వారి ఆత్మహత్యలకు ప్రేరేపించడం సరికాదన్నారు. అంతేకాదు.. నీట్ పరీక్ష కంటే ఉత్తమమైన విధానాలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ఇక నుంచి నీట్‌ను రద్దు చేయడమే.. ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కారమని విజయ్ ఉద్ఘాటించారు. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒకవేళ న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావిస్తే.. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు.
రాహుల్ కు మద్దతు..
విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి తమ వంతు మద్దతు ఉంటుందని విజయ్ ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ను అరెస్టు చేయడాన్ని, ఆయనపై బల ప్రయోగం చేయడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, దీనిని అణిచి వేయాలని చూడడం దారుణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సహా విద్యార్థులకు కూడా తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇన్నాళ్లు గా విద్యార్థులు ఉద్యమిస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం వల్లే సమస్య మరింత పెద్దదైందని విజయ్ ఆరోపించారు. ఈ విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.