ఫోన్ స్విచ్ఛాఫ్.. అజ్ఞాతంలో వైఎస్ ష‌ర్మిల‌..!

admin
Published by Admin — July 25, 2026 in Politics, Andhra
News Image

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా, నిత్యం ఏదో ఒక పోరాటంతో యాక్టివ్‌గా ఉండే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీ పరంగా కీలక పరిణామాలు జరుగుతున్నా, కనీసం స్పందించకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. నాయకులు, కార్యకర్తలు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో.. షర్మిల అజ్ఞాతంలోకి వెళ్లారా? అన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకపక్క నీట్ ఇష్యూలో విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపడుతోంది. ఈ క్రమంలోనే విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం 'ఆంధ్రరత్న భవన్' వద్ద బీజేపీ, కాంగ్రెస్(Congress) కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సొంత పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగి, కార్యకర్తలు గాయపడినా రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిల కనీసం ఒక ఖండన ప్రకటన కూడా విడుదల చేయకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కదన రంగంలో ముందుండే నాయకురాలు ఇలా సైలెంట్ అవ్వడం వెనుక పెద్ద రాజకీయ కోణమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఈ హఠాత్ అజ్ఞాతం వెనుక అసలు కారణం.. కాంగ్రెస్ అధిష్టానంపై షర్మిల తీవ్ర అసంతృప్తితో ఉండటమేనని పార్టీ అంతర్గత వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల  కర్ణాటక(Karnataka) రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థుల జాబితాలో ఖ‌చ్చితంగా తన పేరు ఉంటుంద‌ని ష‌ర్మిల గంపెడాశలు పెట్టుకున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో ఆమె వర్గం కూడా సంబరపడింది. కానీ, అనూహ్యంగా ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు మొండిచేయి చూపించింది. ఆశించి భంగపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. అధిష్టానం తీరుపై అలిగే అజ్ఞాతంలోకి వెళ్లారని టాక్ న‌డుస్తోంది.

ఏపీ(AP)లో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఊపిరి పోసేందుకు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను చేసిన శ్రమకు తగిన గుర్తింపు దక్కలేదనే ఆవేదన షర్మిలలో స్పష్టంగా కనిపిస్తోందని సన్నిహితులు గుసగుసలాడుతున్నారు. తన అవసరం, ప్రాధాన్యత ఏంటో ఢిల్లీ బాసులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని తెలుస్తోంది. మరి షర్మిల అలకను కాంగ్రెస్ పెద్దలు ఎలా చల్లారుస్తారో.. ఏపీ కాంగ్రెస్ బాస్ మళ్లీ ఎప్పుడు పబ్లిక్‌లోకి వస్తారో చూడాలి.

 

Tags
YS Sharmila AP Congress AP Politics Congress BJP Andhra Pradesh AP News NEET
Recent Comments
Leave a Comment

Related News

Latest News