ఏపీ(AP)లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ప్రజలంతా ఇక వైరస్ భయం లేదని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కోవిడ్ సైలెంట్ గా తన పంజా విసురుతోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మరో 7 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఈ తాజా కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరుకుంది. బాధితులకు ఇప్పటికే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుండగా, వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేసే పనిని ముమ్మరం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నారు. అణుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేలా, రోజువారీ కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను సైతం భారీగా పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిపై చాలా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సాధారణ జ్వరమే కదా అని అలసత్వం ప్రదర్శిస్తే ముప్పు తప్పదు. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జ్వరం(Fever), గొంతు నొప్పి, పొడి దగ్గు, లేదా విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే మీకు దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ముందస్తుగా గుర్తిస్తే సులువుగానే ఈ మహమ్మారి నుంచి కోలుకోవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
కరోనా(Corona) రక్కసిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మన చేతుల్లో ఉన్న ఏకైక అస్త్రం జాగ్రత్తలు పాటించడమే. మళ్లీ మాస్కులను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మార్కెట్లు, మాల్స్, బస్సులు వంటి రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించడంతో పాటు, కనీస భౌతిక దూరం పాటించాలి. చేతులను తరచుగా శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఇంట్లోనే ఉంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.