అమరావితి(Amaravati) రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు మూడో వారంలో ప్రారంభం కానున్న ఈ సభను సుమారు రెండు వారాల పాటు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి ఎజెండా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అమరావతి మరియు పోలవరం ప్రాజెక్ట్ల పురోగతి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.
అలాగే కొత్త పెట్టుబడులు, ప్రాజెక్టుల రాకపై కూటమి నేతలు సభలో గట్టిగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, దివంగత నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) మృతికి సంతాపం తెలిపే తీర్మానం ఈ సమావేశాల్లో ప్రధాన ఆకర్షణగా మారనుంది. కాపు సామాజిక వర్గంలో బలమైన ముద్ర ఉన్న ముద్రగడ సంతాప తీర్మానం ద్వారా రాజకీయంగానూ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని కూటమి వ్యూహం రచిస్తోంది.
ఇక అసలు ఉత్కంఠంతా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) వైఖరి చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్న జగన్ అండ్ కో... ఈసారైనా సభలో అడుగుపెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితమైన వైసీపీ, ఈసారి మాత్రం కొన్ని కీలక అంశాలను లేవనెత్తాలని అంతర్గతంగా మధనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీలో అవకతవకలు, శాంతిభద్రతల సమస్యలు, ఆక్వా రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీస్తేనే ప్రజల్లో పట్టు నిలుస్తుందనే అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. సభకు వెళ్లకపోవడం వల్ల తమ గ్రాఫ్ పడిపోతోందన్న విమర్శలను కూడా వైసీపీ సీరియస్‌గానే విశ్లేషిస్తోంది.
మొత్తానికి చూస్తే, ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకల తర్వాత ప్రారంభం కానున్న ఈ అసెంబ్లీ సమావేశాలు ఏపీ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శించడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు ప్రతిపక్షం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ఈసారైనా సభకు వచ్చి పోరాటం చేస్తారా లేదా అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.