గత కొంతకాలంగా రచ్చకెక్కుతున్న కోలీవుడ్(Kollywood) స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారంలో ఎట్టకేలకు చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో జయం రవికి బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది. అసలేం జరిగిందో చూస్తే..
భార్య ఆర్తితో మనస్పర్థలు వచ్చి విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత జయం రవి(Jayam Ravi) తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో భరణం కింద ఆర్తి భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. నెలవారీ ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.40 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. అంటే ఏడాదికి దాదాపు రూ.4.8 కోట్లు చెల్లించాలన్న మాట. ఒక సినిమా పూర్తి చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకునే రవికి ఈ మొత్తం మోయలేని భారంగా మారుతుందని అప్పట్లో ఆయన అభిమానులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఆర్తి(Aarti) వేసిన ఈ భారీ భరణం పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపి ఆమెకు షాక్ ఇచ్చింది. ఆమె డిమాండ్‌ను పూర్తిగా తోసిపుచ్చిన న్యాయస్థానం.. కేసు విచారణ ముగిసే వరకు తాత్కాలిక భరణంగా కేవలం నెలకు రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వాలని జయం రవిని ఆదేశించింది. రూ.40 లక్షలు డిమాండ్ చేస్తే కేవలం రూ.3 లక్షలే కోర్టు కేటాయించడంతో ఈ కేసులో అసలుసిసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చిందని చెప్పాలి.
కేవలం ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, మరో విషయంలోనూ జయం రవికి ఊరట దక్కింది. తన కన్న పిల్లలను కలుసుకోకుండా ఆర్తి అడ్డుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. కోర్టు(Court) కొన్ని నిర్దిష్ట నిబంధనలతో పిల్లలను కలిసేందుకు రవికి అనుమతి ఇచ్చింది. మొత్తానికి ఈ పరిణామంతో జయం రవికి ఆర్థికంగా, మానసికంగా పెద్ద ఉపశమనం లభించినట్లయింది.