రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ మరోసారి ఊహించని పరిణామంతో అందరి దృష్టిని ఆకర్షించింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న జనసేని అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు మీడియా ముఖంగా పార్టీ గళాన్ని వినిపిస్తూ వచ్చిన అధికార ప్రతినిధుల వ్యవస్థపై ఆయన వేటు వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఛానెళ్లు, చర్చా వేదికల్లో జనసేన వాదనను బలంగా వినిపిస్తున్న మొత్తం 26 మంది అధికార ప్రతినిధుల బాధ్యతలను పార్టీ అధిష్టానం తక్షణమే రద్దు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు చెందిన 14 మందితో పాటు మిగతా ప్రతినిధులు కూడా ఉన్నారు. సంస్థాగత ప్రక్షాళనలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ తాజా పరిణామంతో మీడియా సర్కిల్స్‌లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చ మొదలైంది. కొత్త కమిటీల కూర్పు పూర్తయ్యే వరకు జనసేన(Janasena) తరఫున ఎవరూ కూడా టీవీ డిబేట్లు, మీడియా సమావేశాలు లేదా ఏ ఇతర చర్చల్లోనూ పాల్గొనకూడదని పవన్ కళ్యాణ్ అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, పార్టీ తరఫున అధికారిక ప్రకటనలు ఇచ్చే వెసులుబాటును కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు.
త్వరలోనే సరికొత్త సమీకరణాలతో సరికొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తూ జనసేన కొత్త అధికార ప్రతినిధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి ఆ రేసులో ఎవరుంటారనే దానిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి పవన్(Pawan) తీసుకున్న ఈ మాస్టర్ స్ట్రోక్ డిసిషన్ జనసేనలో సరికొత్త చర్చకు తెరలేపింది.