రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలు, వారి చుట్టూ అరిగే వివాదాలు ఎప్పుడూ సంచలనమే అవుతుంటాయి. తాజాగా పినపాక మాజీ ఎమ్మెల్యే , బీఆర్‌ఎస్ నేత రేగా కాంతారావు(Ex-BRS MLA Rega Kantha Rao) భాగోతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియా రంగంలో పనిచేస్తున్న ఓ యువతి నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి, సదరు నేత అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెట్టడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. కేవలం మాటలతో నమ్మించడం, ఆ తర్వాత శారీరకంగా వాడుకోవడం, చివరకు ముఖం చాటేయడం వంటి పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
నగరంలో పీజీలో నివసిస్తూ జర్నలిజం వృత్తిలో ఉన్న ఆ యువతికి, 2022 కాలంలో ఓ వృత్తిపరమైన ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతా రావు పరిచయం అయ్యారు. కొత్త యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిద్దామంటూ మొదలైన ఈ పరిచయం క్రమంగా వ్యక్తిగత సాన్నిహిత్యానికి దారితీసింది. తాను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఆ మాజీ ఎమ్మెల్యే, ఆ యువతిని మానసికంగా పూర్తిగా తన దారికి తెచ్చుకున్నారు. అమీర్‌పేట(Ameerpet)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొన్నాళ్లపాటు సహజీవనం కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ బంధం ముసుగులో ఆమెకు తెలియకుండా ప్రైవేట్ ఫొటోలు సేకరించి, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారని యువతి ఆరోపిస్తోంది.
కేవలం శారీరకంగానే కాకుండా, ఆర్థికంగానూ ఆ యువతిని ఆయన వేధించినట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయంటూ నమ్మించి ఆమె వద్ద నుంచి రూ. 4 లక్షల వరకు కాజేశారు. తీరా ఆ డబ్బు గురించి నిలదీసేసరికి ఆయన రూపం పూర్తిగా మారిపోయింది. బాధితురాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న సమయంలో ఒత్తిడి తేవడంతో, తన అనుచరుల ద్వారా కొన్ని విడతలుగా కొంత మొత్తం పంపినప్పటికీ.. తాను కోరుకున్నది డబ్బు కాదని, తన నలుగురేళ్ల విలువైన జీవితాన్ని మోసగించడమేనని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణంపై గతంలో షీ టీమ్స్‌ను ఆశ్రయించినా, సదరు మాజీ ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి ఎదురుదాడికి దిగారని బాధితురాలు వాపోయారు. ఎక్కడా న్యాయం జరగకపోవడంతో చివరికి నాంపల్లి కోర్టును ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కదిలిన యంత్రాంగం.. రేగా కాంతా రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station)లో బీఎన్ఎస్ సెక్షన్ 69 మరియు 351(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం తనకూ, తన కుటుంబ సభ్యులకు ఆ నేత వర్గం నుంచి తీవ్ర ప్రాణహాని ఉందని, తనకు తగిన రక్షణ కల్పించాలని బాధితురాలు కన్నీరుమున్నీరవుతున్నారు. మరి ఈ ఉచ్చులో మాజీ ఎమ్మెల్యే నిజంగానే చిక్కుకుంటారా లేక రాజకీయ వత్తిళ్లతో కేసు వీగిపోతుందా అనేది వేచి చూడాలి.