టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు ఆలోచనా విధానం ఎప్పుడూ ఒక వ్యూహాత్మక అడుగు ముందుకే ఉంటుంది. ప్రతీ నిర్ణయం వెనుక భవిష్యత్తు రాజకీయాల బేరీజు ఉంటుంది. ఇప్పుడు కూడా ఏపీ రాజకీయాల్లో అలాంటి చర్చే హాట్ టాపిక్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీని సన్నద్ధం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్టీ పగ్గాలను ప్రక్షాళన చేసేందుకు హైకమాండ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈసారి ఉత్తరాంధ్ర రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో అక్కడ దక్కిన ఊపును మరింత పెంచేందుకు, పరిశ్రమల ఏర్పాటుతో ప్రజలకు చేరువవుతున్న తరుణంలో పార్టీ పరంగా కీలక మార్పులు ఉండబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే, ఏపీ(AP) టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ పాత్రలో పెద్ద మార్పు రాబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మృదు స్వభావిగా పేరున్న ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుని కీలక మంత్రి పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, పల్లా శ్రీనివాస్ చేతుల నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలను వేరే సీనియర్ నేతకు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం. వైసీపీ(YCP) దూకుడును అదే స్థాయిలో తిప్పికొట్టగల దిట్ట అయిన శ్రీకాకుళం సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడికి మరోసారి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు లేదా కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేశారనే అసంతృప్తి నేపథ్యంలో.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్రంలోనూ అదే వర్గానికి మంత్రి పదవి ఇస్తే మిగతా వర్గాలు అసంతృప్తి చెందే ఛాన్స్ ఉందని పార్టీ హైకమాండ్ బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో అచ్చెన్నాయుడి సేవలను పార్టీ సంస్థాగత బలోపేతానికి (రాష్ట్ర అధ్యక్షుడిగా) ఉపయోగించుకుని, కేబినెట్‌లో మాత్రం స్థానిక సామాజిక సమీకరణాల ప్రకారం కాళింగ వర్గానికి చెందిన మరో నేతకు మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాతే ఈ మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ ప్రచారంలో ఏది నిజమవుతుందో, చంద్రబాబు(Chandrababu) ఎటువంటి సామాజిక అస్త్రాలను ప్రయోగిస్తారనేది వేచి చూడాలి.