ఉత్తరాంధ్ర ప్రజల కలను సాకారం చేస్తూ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఎయిర్ పోర్ట్ జాతికి అంకితమైంది. అయితే, ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ పోర్టు వస్తుందా అంటూ వైసీపీ నేతలు గతంలో ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే నేడు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లోకేశ్ ఆ విషయంపై స్పందించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదని ఎద్దేవా చేశారని, కానీ, ఈ రోజు ఎయిర్ బస్సు వచ్చిందని లోకేశ్ గర్వంగా చెప్పారు. వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారని వైసీపీ నేతలనుద్దేశించి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఎర్రబస్సు కాదు ఎయిర్ పోర్టు వచ్చిందని, ప్రధాని నరేంద్ర మోదీ(న.మో) వచ్చారని...అర్థమైందా రాజా అంటూ వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర కలలకు నమో రెక్కలిచ్చారని కొనియాడారు.