మన్మోహన్ సింగ్ ను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గా పిలవటం తెలిసిందే. ఆ మాటకు వస్తే. ఈ పేరు మీద మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు ఒక పుస్తకాన్ని రాశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగానే కాదు.. దాని కంటే ముందుగా దేశ ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఆ పదవిని ఆఫర్ చేసినప్పుడు.. ఆయన ఎలా ఫీల్ అయ్యారు? ఎలా స్పందించారన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసిన మన్మోహన్ కు.. దేశ ఆర్థిక మంత్రిగా అవకాశం ఇస్తున్నట్లుగా చెప్పిన విషయాన్ని ఆయన అస్సలు నమ్మలేదట. ఇదే విషయాన్ని మన్మోహన్.. స్వయంగా ఒక వేదిక మీద వెల్లడించారు. తనకు దేశ ఆర్థిక మంత్రిగా అవకాశం కల్పిస్తూ.. నాటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయం గురించి చెప్పిన మన్మోహన్ సింగ్.. ‘‘1991 జూన్ 21న భారత ప్రధాని పీవీ నరసింహారావు నుంచి ఫోన్ వచ్చింది. మన్మోహన్‌జీ మీరెక్కడున్నారు? అని పీవీ అడిగారు. నేను యూజీసీలో ఉన్నానని చెప్పా. మీకు అలెగ్జాండర్ ఏమీ చెప్పలేదా? అని పీవీ అడిగారు. చెప్పాడు కానీ, నేను సీరియ్‌సగా తీసుకోలేదని అన్నాను. ‘లేదు.. ఇది చాలా సీరియస్, మీరు ఇంటికి వెళ్లి డ్రెస్ చేసుకుని ప్రమాణ స్వీకారానికి రండి’ అని పీవీ చెప్పారు’’ అని అప్పట్లో ఏం జరిగిందో చెప్పిన మన్మోహన్ అందరిని నవ్వించారు. ఇదంతా 2018 డిసెంబరులో తన పుస్తకం చేంజింగ్ ఇండియా ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు.