వడ్డీ లేని రుణాలు.. ఏపీ రైతుల‌కు పండ‌గే పండ‌గ‌.!

admin
Published by Admin — August 03, 2026 in Andhra
News Image

అన్నదాతల కళ్లలో ఆనందం చూసేందుకే ప్రభుత్వాలు ఉన్నాయనడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతుల ఉదంతమే తాజా ఉదాహరణ. మార్కెట్‌లో ఆశించిన డిమాండ్ లేక, ఊహించని విధంగా ఉత్పత్తి పెరిగి గల్లా అమ్ముకోలేక అల్లాడుతున్న తరుణంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించిన చేయూత అక్షరాలా కొండంత బలంగా నిలిచింది. ఒకవైపు మార్కెట్ కుప్పకూలిన వేళ, ఏ క్షణాన ఏం జరుగుతుందోనని దిగులుతో కుంగిపోయిన రైతులకు ఈ నిర్ణయం నిజంగానే ఒక ఊరటనిచ్చే పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది.

పరిస్థితి తీవ్రతను ముందే గ్రహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) తక్షణ స్పందనతో చక్రం తిప్పారు. ఢిల్లీ వేదికగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగి, వాణిజ్య మంత్రిత్వ శాఖ, టొబాకో బోర్డు అధికారులతో జరిపిన సుదీర్ఘ మంతనాలు ఫలించాయి. ఎక్కడా లేని విధంగా ప్రతి బార్న్‌కు రూ. 50 వేల చొప్పున రెండేళ్ల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 45 వేల బార్న్‌లకు సుమారు రూ. 250 కోట్ల మేర ఆర్థిక భరోసా దక్కనుండగా, నేరుగా వేలాది మంది రైతన్నలకు లబ్ధి చేకూరనుంది.

కేవలం రుణాలతోనే సరిపెట్టకుండా, లో-గ్రేడ్, ఆఫ్-స్టైల్ పొగాకు విక్రయాల్లో రైతులు(Formers) ఎదుర్కొంటున్న నష్టాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు భుజం వేసింది. కిలో పొగాకుపై రూ. 10 చొప్పున ధర లోటు భర్తీ కింద ఏకంగా రూ. 100 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మొత్తాన్ని ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు వ్యాపారులు, ఎగుమతిదారులు కూడా ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. బ్రైట్ గ్రేడ్‌కు రూ. 230, మీడియం గ్రేడ్‌కు రూ. 190, లో గ్రేడ్‌కు రూ. 110, ఆఫ్‌-స్టైల్‌కు రూ. 130 చొప్పున ధరలను నిర్ణయించి కొనుగోళ్లు చేపట్టేందుకు అంగీకరించారు. మొత్తానికి, సంక్షోభంలో కూరుకుపోతున్న పొగాకు సాగు రంగాన్ని ప్రభుత్వాల సమన్వయ చొరవతో మళ్లీ గాడిన పెట్టడం పట్ల రైతన్నల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tags
AP Tobacco Farmers Chandrababu Naidu Farmers Andhra Pradesh AP News Agriculture Tobacco Board Farmer Welfare
Recent Comments
Leave a Comment

Related News