ఏపీ(AP) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. ఒకనాడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి ప్రధాన ఆపద్బాంధవుడిగా పేరుగాంచిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర స్వరం వినిపించారు. అనంతపురం వేదికగా ఆయన తన కొత్త పార్టీని ఉద్ధేశించి చేసిన ప్రకటనలు, అనుచరులతో జరిపిన మంతనాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం ఒకరిద్దరి గుప్పిట్లోకి అధికారం వెళ్లిపోవడంతో రాయలసీమలో అణగారిపోయిన కేడర్‌కు భరోసా కల్పించేందుకే తాను ఈ కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన కుండబద్దలు కొట్టేశారు.
విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడానికి, అలాగే ఆ తర్వాత నిలదొక్కుకోవడానికి రాయలసీమ ప్రాంతంలోని రెడ్డి సామాజికవర్గం, క్షేత్రస్థాయి కేడర్ అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని పూర్తిగా మరిచిపోయి, కేవలం కోటరీ సభ్యులు మాత్రమే అన్ని పదవులను అనుభవించారని ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా పార్టీ కోసం రక్తం చిందించిన నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా అవమానించారని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమలో రెడ్డి వర్గం ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందని, వారి హక్కులను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
తమది 'ఒరిజినల్ రెడ్ల' పార్టీ అని విజయసాయి రెడ్డి ప్రకటించడం ద్వారా వైఎస్సార్‌సీపీ(YSRCP)కి గట్టి హెచ్చరిక పంపినట్లు అయింది. ఇప్పటివరకు సీమలో కేవలం ఒకరిద్దరు నాయకుల చుట్టూనే రాజకీయాలు తిరిగాయని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని ఆయన తేల్చిచెప్పారు. అయితే, కేవలం ఒకే సామాజికవర్గానికి పరిమితం కాకుండా, సామాజిక న్యాయాన్ని పాటిస్తూనే రెడ్డి వర్గానికి దక్కాల్సిన నాయకత్వ పీఠాన్ని తిరిగి కట్టబెట్టడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే విజయవాడలో ప్రెస్ మీట్ పూర్తి చేసుకున్న ఆయన, అనంతపురం కేంద్రంగా కడప, కర్నూలు జిల్లాల అసంతృప్త నేతలను, కేడర్‌ను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇక విజయసాయి రెడ్డి ప్రయోగిస్తున్న ఈ 'రెడ్డి కార్డ్' అస్త్రం వైఎస్సార్‌సీపీ బలమైన ఓటు బ్యాంకుకు పెద్ద గండి కొట్టేలా కనిపిస్తోంది. ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ మధ్య నలుగుతున్న ఏపీ రాజకీయాల్లో, తన పార్టీ ద్వారా సామాన్యుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. 2029 ఎన్నికల్లో టీడీపీ(TDP)కి ఓటేస్తే లోకేష్, వైసీపీకి ఓటేస్తే జగన్ వస్తారని.. కానీ తమ పార్టీ ద్వారా పూర్తి భిన్నమైన నాయకత్వాన్ని అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సొంత గడ్డపైనే జగన్ మోహన్ రెడ్డికి మాజీ సహచరుడే ముప్పేట దాడి చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో రాయలసీమ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.