ఈ సోషల్ మీడియా జమానాలో ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న రీతిలో వదంతులు వ్యాపిస్తున్నాయి. నిజం ఏంటి అని తెలుసుకునే లోపే అబద్ధం 60 ఊళ్లు దాటుతుంది అన్న రీతిలో వాస్తవం వెలుగులోకి వచ్చేలోపే సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నియమితులయ్యారు అంటూ రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చిరంజీవిని ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీం మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అటువంటి వార్తలు నమ్మొద్దని, ప్రచారం చేయవద్దని తెలిపింది.