ఢిల్లీలో వైసీపీ కొత్త నాట‌కం.. దాని కోస‌మేనా..?

admin
Published by Admin — August 07, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో రాజకీయం మారుతోంది. ప్రతిపక్ష నేత పర్యటనల తీరు తెన్నులు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) టూర్లు జరుగుతున్న తీరును గమనిస్తే.. ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న పరిణామాలు కావు, వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు సృష్టించడం, వాటిని హైలైట్ చేయడం చూస్తుంటే ఇదొక పక్కా స్క్రిప్ట్ లా కనిపిస్తోంది.

ఒకవైపు పరామర్శల పేరుతో పర్యటనలు ఖరారు చేయడం, మరోవైపు భద్రతా నిబంధనలను గాలికొదిలేయడం ఇక్కడ ప్రధాన వ్యూహంగా మారుతోంది. జనాలను, కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగానే కాన్వాయ్ ముందుకి దూక‌డానికి అవకాశం కల్పించే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అక్కడ జరిగే చిన్నపాటి తోపులాటలు, గందరగోళాన్ని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తే చాలు.. వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. "ప్రజాదరణ చూసి ఓర్వలేక అడ్డుకుంటున్నారు" అంటూ కెమెరాల ముందు విక్టిమ్ కార్డ్(Victim Card) ప్లే చేయడం సర్వసాధారణమైపోయింది.

ఒకవేళ శాంతిభద్రతల సమస్య రాకూడదని పోలీసులు పూర్తి స్వేచ్ఛనిచ్చి, ఎలాంటి ఆంక్షలు పెట్టకపోతే పరిస్థితి వేరేలా ఉంటోంది. అప్పుడు సరికొత్త వాదన తెరపైకి తెచ్చి.. "మాజీ సీఎంకు కనీస భద్రత లేదు, ప్రాణాలకు ముప్పు ఉంది" అంటూ హడావుడి చేస్తున్నారు. ఢిల్లీ(Delhi)కి పరుగెత్తి మరీ కేంద్ర పెద్దలకు ఫిర్యాదులు చేయడం, అమిత్ షాను కలవడం వెనుక అసలు మతలబు ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పోలీసులను ఆత్మరక్షణలో నెట్టి, కేంద్ర బలగాల సెక్యూరిటీని సాధించుకోవడమే ఈ హైడ్రామా అసలు లక్ష్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి, ఆపినా సమస్యే, వదిలేసినా రాజకీయామే అన్నట్టుగా సాగుతున్న ఈ డ్రామా చూస్తుంటే.. ప్రతి అడుగులోనూ మైలేజ్ కోసం పావులు కదుపుతున్న వైసీపీ(YCP) శైలి స్పష్టంగా అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో రచ్చ చేసి, జాతీయ స్థాయిలో సింపథీ సంపాదించే ఈ సరికొత్త రాజకీయ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.

Tags
YSRCP YS Jagan Andhra Pradesh AP Politics Victim Card Delhi Politics Amit Shah
Recent Comments
Leave a Comment

Related News