వెలిగొండ ప్రాజెక్టు... మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లా వాసులు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలల ప్రాజెక్టు. ఆ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడంతో ఆగస్టు 31వ తేదీన ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించి నీటిని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మూడో విడత పరిహారం 250 కోట్ల రూపాయల చెక్కును వారికి సీఎం చంద్రబాబు అందజేశారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని, రికార్డు స్థాయిలో 48 రోజుల్లో 765 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామని చంద్రబాబు అన్నారు. 2021 లోనే తొలి విడత పనులు పూర్తి కావాల్సి ఉందని, కానీ, వైసీపీ నాయకుల డ్రామాల వల్ల ఆలస్యమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా వైసీపీ ప్రభుత్వం చిదిమేసిందని, అయినా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూనే ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు రాకపోయినా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పారు. 1996లో ఈ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేశానని, ఇప్పుడు 2026లో తన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించడం తన అదృష్టమని చంద్రబాబు అన్నారు.