రాజకీయాల్లో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎవరి తలరాత ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు అధికారం అండతో చెలరేగిన నేతలు, కాలం మారాక తాము చేసిన తప్పులకే సొంత అనుభవాలతో సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుంటుంది. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కుటుంబం. గతంలో ప్రత్యర్థులపై విరుచుకుపడి, అధినేత మెప్పు కోసం తెగ ప్రచారం పొందిన ఆయన, ఇప్పుడు ఏకంగా సొంత ఇంటి రచ్చతో సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన పనే లేదని, ఎవరి ఖర్మ వారినే అనుభవింపజేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో నాటి ప్రభుత్వ పెద్దల అనుగ్రహం కోసం ప్రత్యర్థి నేతల ఇళ్లపై దాడులకు తెగబడిన జోగి రమేష్, ఆనాడు ఉచిత పబ్లిసిటీతో తెగ సంబరపడ్డారు. కానీ, కాల చక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడదే నోరు మెదపలేని రీతిలో కుటుంబ వ్యవహారాలు రోడ్డుకెక్కడంతో ఆ పబ్లిసిటీ కాస్తా పరువు గోదాట్లో కలిసేలా చేసింది.
తన భర్త సంసారానికి పనికి రాడని, అతని గురించి చేదు నిజాలు దాచిపెట్టి బలవంతంగా పెళ్లి చేశారంటూ స్వయంగా కోడలు పోలీసులను ఆశ్రయించడం, గృహహింస చట్టాల కింద కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది. ఈ కేసుల ఉచ్చులో కుటుంబ సభ్యులంతా కూరుకుపోవడం, జైలు పాలయ్యే ప్రమాదం ముమురుగా కనిపిస్తుండటం జోగి(Jogi) రాజకీయ జీవితానికే పెద్ద మచ్చగా మారుతోంది.
ఇలాంటి క్లిష్ట సమయంలో రాజకీయంగా అండగా నిలవాల్సిన అధినేత జగన్‌మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) నుంచి కనీస స్పందన కరువైంది. ఎక్కడెక్కడికో పరామర్శలకు వెళ్లే అధినేత, తన కోసం నాడు కేసులు మోసిన అనుయాయుడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో జోగి రమేష్ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. అదృష్టవశాత్తు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ లభించినప్పటికీ, విచారణ సాగుతున్న కొద్దీ మీడియాలో వచ్చే కథనాలు ఆయన కుటుంబాన్ని మానసికంగా కుంగదీస్తూనే ఉంటాయి. మొత్తానికి, పెద్దలు చెప్పినట్లు కర్మ ఫలితం ఎవరినీ వదిలిపెట్టదనే నానుడి జోగి రమేష్ ఉదంతంతో మరోసారి రుజువైంది. ప్రత్యర్థులను వేధించిన గొడ్డలి రాజకీయాలు ఇప్పుడు సొంత ఇంటి నుంచే శాపంగా మారడం గమనార్హం.