తెలంగాణ(Telangana) రాజకీయాల్లో కుటుంబ బంధాలు, రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారుతూనే ఉంటాయి. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యక్తం చేసిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే ఈ పండుగ రోజున కూడా సోదరుడు కేటీఆర్‌ను కలవలేకపోయానన్న బాధను ఆమె బహిరంగంగా వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది.
పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈసారి రాఖీ(Rakhi) కడతారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కవిత సూటిగా స్పందించారు. క్రితం ఏడాది కూడా అన్న అందుబాటులో లేకుండా పోయారని, ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమైందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్ ముందస్తు సమాచారం లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడంపై ఆమె బహిరంగంగానే అసహనం ప్రదర్శించారు.
తనకు రాఖీ పండుగ అంటే కేవలం ఆచారం కాదని, అది సోదర ప్రేమకు, అనుబంధానికి చిహ్నమని కవిత(Kavitha) అన్నారు. అయితే ఈ పవిత్రమైన బంధం కూడా రాజకీయ సందర్భాల మధ్య మరుగున పడిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా తన సోదరుడికి రాఖీ కట్టలేకపోయాయనని.. అయితే తనకు ఒక మహిళగా, సోదరిగా ఆత్మగౌరవం ఉంటుందని, దానిని కాపాడుకోవడం తన హక్కు అని స్పష్టం చేశారు.
కాగా, కవిత హర్ట్ అవ్వడానికి కారణం కేటీఆర్(KTR) కుటుంబం అమెరికా పర్యటనలో ఉండటమే. తన కుమార్తె అలేఖ్యకు అమెరికాలోని ప్రముఖ వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ప్రవేశం లభించడంతో, ఆమె అడ్మిషన్ ప్రక్రియ కోసం కేటీఆర్ కుటుంబంతో సహా అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు వారాల పాటు ఆయన అక్కడే ఉండనున్నట్టు సమాచారం. దీంతో రాఖీ పండుగ సమయానికి హైదరాబాద్‌లో అందుబాటులో ఉండలేకపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది కేవలం వ్యక్తిగత కారణమా, లేక కుటుంబ బంధాల్లో ఏర్పడిన అంతరానికి సంకేతమా అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ఇక కుటుంబ విషయాలను బహిరంగంగా ప్రస్తావించడం ద్వారా కవిత ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.