ప్రధాని రేస్‌లో విజ‌య్‌.. ఇదెక్క‌డి మాస్ రా..!

admin
Published by Admin — August 28, 2026 in Politics, National
News Image

తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైన కొన్ని నెలల్లోనే, జాతీయ రాజకీయాల్లో ఒక సంచలన ట్రెండ్ మొదలైంది. టీవీకే పార్టీ పెట్టి, అనూహ్యంగా తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్.. ఇప్పుడు నేరుగా ప్రధాని రేసులోకి ఎంటరైపోయారు. తాజాగా విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది.

సాధారణంగా ప్రధాని పదవి రేసు అంటే దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతల మధ్యే నడుస్తుంది. కానీ ఈసారి సర్వే ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మోడీ(Modi) 48.7 శాతంతో తొలిస్థానంలో, రాహుల్ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. మూడో స్థానంలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ లాంటి సీనియర్ నేతలను వెనక్కి నెట్టి మరీ విజయ్ 9.2 శాతంతో దూసుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది కూడా పూర్తికాకుండానే ఈ స్థాయి మద్దతు దక్కడం నిజంగా చర్చనీయాంశమే.

దీని వెనుక కేవలం సినిమా క్రేజ్ మాత్రమే కారణం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులో టీవీకే(TVK) సాధించిన ఊహించని విజయం, దానికి తోడు పార్టీ నేతల దూకుడు వ్యూహాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే అసెంబ్లీలో టీవీకే మంత్రి శరత్ కుమార్ నేరుగా విజయ్‌ను దేశ తదుపరి ప్రధానిగా అభివర్ణించడం విశేషం. మరో మంత్రి ఆధవ్ అర్జున కూడా దక్షిణాది నుంచి ఒక ప్రధాని రావాలని, ఆ స్థానం తమిళనాడుదే కావాలని అనడం పార్టీ లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.. రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన కొద్ది నెలల్లోనే జాతీయ స్థాయి నేతగా ఎదగడం సాధ్యమేనా? చరిత్రలో చూస్తే, ఇలాంటి వేగవంతమైన ఎదుగుదల చాలా అరుదు. కానీ సర్వే గణాంకాలు మాత్రం విజయ్‌(Vijay)కు ఒక నిర్దిష్ట వర్గంలో బలమైన ఆదరణ ఉందని చెప్పకనే చెబుతున్నాయి. మ‌రి ఇది కేవలం తాత్కాలిక సెంటిమెంట్‌ మాత్రమేనా, లేక దీర్ఘకాలంలో నిలబడే రాజకీయ శక్తిగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.   

Tags
Vijay TVK Thalapathy Vijay PM Race Mood Of The Nation MOTN Tamil Nadu Politics Modi Rahul Gandhi
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News