చిక్కుల్లో వైసీపీ మాజీ మంత్రి ధర్మాన.. కేసు న‌మోదు!

admin
Published by Admin — August 30, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అధికారంలో లేకపోయినా, కీలక నేతల చుట్టూ వివాదాలు మాత్రం వీడటం లేదు. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చిక్కుల్లో పడ్డారు. నిబంధనలను పక్కనపెట్టి, బలవంతంగా గృహప్రవేశాలు చేయించారన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆయనపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ పరిణామం ఉమ్మడి శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

అసలేం జరిగింది..?
కొన్నేళ్ల క్రితం వచ్చిన హుద్‌హుద్(Hudhud) తుపాను బాధితులకు అప్పట్లో ప్రభుత్వం గృహాలను కేటాయించింది. అయితే, ఇళ్ల కేటాయింపు. పంపిణీ సమయంలో కొందరు లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడంతో ఆ హౌసింగ్ కాలనీలోని కొన్ని ఇళ్లు ఖాళీగానే ఉండిపోయాయి. కాలం గడిచినా తమకు ఆ ఇళ్లు దక్కలేదనే ఆవేదనతో ఉన్న స్థానిక మత్స్యకార కుటుంబాలు, వాటిని తమకే కేటాయించాలని కొంతకాలంగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. 

అయితే గత మే 14వ తేదీన స్థానిక మత్స్యకారుల డిమాండ్‌కు మద్దతుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao), జడ్పీటీసీ సభ్యురాలు రుప్ప దివ్యతో పాటు మరో ఆరుగురు వ్యక్తులు నేరుగా ఆ ఖాళీ ఇళ్ల వద్దకు వెళ్లారు. అధికారిక అనుమతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించకుండానే తాళాలు పగులగొట్టి ఆ ఇళ్లలోకి మత్స్యకారులతో గృహప్రవేశాలు చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై హౌసింగ్ డిపార్ట్‌మెంట్ తీవ్రంగా స్పందించింది.

ప్రభుత్వ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించడం, అక్రమంగా గృహప్రవేశాలు చేయించడాన్ని గృహనిర్మాణ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు శ్రీకాకుళం(Srikakulam) హౌసింగ్ డిపార్ట్‌మెంట్ డీఈఈ వి.వి. సత్యాజీ నేరుగా శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఎస్సై కరణం సురేష్ మరియు సిబ్బంది.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు మొత్తం ఎనిమిది మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ప్రతిపక్ష నేతపై అధికారికంగా కేసు నమోదు కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 

Tags
Dharmana Prasada Rao YSRCP Srikakulam Andhra Pradesh AP News AP Politics Hudhud Houses
Recent Comments
Leave a Comment

Related News