YSR అవార్డు వేడుక.. వైసీపీ నేతలు దూరం..?

admin
Published by Admin — September 02, 2026 in Politics, Andhra
News Image

వైఎస్సార్ పేరు చెబితేనే రాజకీయాల్లో అలజడి రేగుతుంది. కానీ, అదే వైఎస్సార్ పేరుతో ఎక్కడో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక అవార్డు వేడుక మాత్రం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చకు తెరలేపింది. డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహానేత 17వ వర్ధంతి వేళ వ్యవసాయ రంగ దిగ్గజం ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్‌కు అరుదైన పురస్కారాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వైఎస్సార్‌ను గుండెల్లోతుల్లో దాచుకున్న పలువురు హేమాహేమీలు ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే అసలు సిసలు దుమారానికి కారణమవుతోంది.

వైఎస్సార్‌ను తమ పార్టీకి మూల విరాట్‌గా, రాజకీయ ఊపిరిగా చెప్పుకునే వైసీపీ అధినాయకత్వం, ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఈ వేడుకకు పూర్తిగా హ్యాండ్ ఇచ్చేస్తున్నాయి. అయితే వైసీపీ నాయకత్వం ఇలాంటి కార్యక్రమాలను బహిష్కరించడం వెనుక బలమైన రాజకీయ లెక్కలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు లేదా ఇతర ప్రముఖులు నిర్వహించే ఏ సంస్మరణ సభకైనా వైసీపీ శ్రేణులు వెళితే, అది పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)కి ఆగ్రహం తెప్పిస్తుందనే ప్రచారం ఉంది. వైఎస్సార్ ఇమేజ్‌ను కేవలం తమ రాజకీయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మాత్రమే పరిమితం చేసుకోవాలని భావించే ఆ పార్టీ పెద్దలు, ఆయన ఆశయాలను విస్తృతం చేసే అధికారిక లేదా సామాజిక వేడుకల పట్ల ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు వైఎస్సార్(YSR) వారసులమని చెప్పుకుంటూనే, మరోవైపు ఆయన జ్ఞాపకార్థం జరిగే ఏ వేడుకలోనూ కనిపించకపోవడం వైరుధ్యంగా మారుతోంది. రాజకీయ లబ్ది కోసమే వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారనే ఆరోపణలకు ఈ వైఖరి మరింత బలం చేకూరుస్తోంది. కాగా, సొంత మహానేత జ్ణాపకాలను కూడా రాజకీయ చట్రంలో బంధించి, కేవలం తమకు నొచ్చిన చోటే ప్రేమను ఒలకబోసే ఈ తీరుపై రాజకీయ పరిశీలకుల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Tags
YSRCP YS Jagan YSR 17th Death Anniversary Andhra Pradesh AP Politics Delhi Event Revanth Reddy
Recent Comments
Leave a Comment

Related News