దేశ రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రజాసేవకు పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, బీజేపీ అధిష్ఠానం ఒక బృహత్తర కార్యక్రమానికి తెరలేపింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ భారీ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి కమలనాథుల హైకమాండ్ తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయే(NDA) కూటమి తరఫున నిర్వహించబోయే ఈ నెల రోజుల సుదీర్ఘ సేవా కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అప్పగించింది. జాతీయ స్థాయిలో మోదీ పాలన రజతోత్సవ వేడుకలను సౌత్ ఇండియాలో విజయవంతం చేసే పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలను ఆయనకు కట్టబెట్టడం ద్వారా బీజేపీ పెద్దలు ఆయనపై ఉంచిన నమ్మకం ఏపాటిదో స్పష్టమవుతోంది.
'వికసిత్ భారత్-2047' లక్ష్య సాధనే ధ్యేయంగా సాగనున్న ఈ అభియాన్‌లో భాగంగా దక్షిణాదిలో వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 'ఆశీర్వాద్ కా దియా', 'నమో సేవా గాథ', 'ఆంగన్ కా ఉత్సవ్', 'కహానీ బద్లావ్ కి', 'సేవా జ్యోతి యాత్ర' వంటి విభిన్న ప్రజా భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని బీజేపీ(BJP) వ్యూహరచన చేసింది. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాల అమలు తీరు, కార్యాచరణను సమన్వయం చేసే బాధ్యతలను మంత్రి సత్యకుమార్ తన భుజానేసుకున్నారు.
కాగా, ఈ ప్రత్యేక వ్యూహంలో భాగంగానే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌నకు మంత్రి సత్యకుమార్(Minister SatyaKumar) హాజరవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల శ్రేణులను సమాయత్తం చేస్తూ, కార్యక్రమ విజయానికి అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ మంత్రి హోదాలో ఉంటూనే, జాతీయ స్థాయిలో దక్షిణాది రాజకీయాలను శాసించేలా కీలక పదవిని దక్కించుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.