తెలంగాణ(Telangana) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్లుగా పరిస్థితికి వచ్చింది. నేరుగా సీఎం టార్గెట్‌గా ఆమె చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఢిల్లీ పెద్దల వరకు అందరికీ షాకిచ్చాయి. కేవలం పార్టీ లైన్ దాటడమే కాకుండా, అధిష్ఠానం వద్దే స్వయంగా సీఎంపై ఫిర్యాదుల అస్త్రాలు సంధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తన కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారానికి కొండా సురేఖ తనదైన శైలిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న ఆమె, పార్టీ హైకమాండ్‌ను కలిసి తన వాదనను బలంగా వినిపించారు. తనను టార్గెట్ చేయడం మానేసి, ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని ఆమె ఏకంగా అధిష్ఠానాన్నే డిమాండ్ చేసినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు స్వతంత్రంగా ఉండాలని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెబుతుంటారని, తన కూతురిని తీవ్రంగా రెచ్చగొట్టడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందని ఆమె వాదించారు.
ఈ వివాదంలో సామాజిక వర్గాల కోణాన్ని కూడా కొండా సురేఖ(Konda Surekha) గట్టిగానే తెరపైకి తెచ్చారు. పార్టీలో బీసీలకు ఒక రకమైన న్యాయం, రెడ్డి సామాజిక వర్గానికి మరో రకమైన న్యాయం అమలు చేస్తున్నారంటూ ఆమె నేరుగా ప్రశ్నించారు. రెడ్డి వర్గానికి చెందిన నాయకులు ఎంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని పార్టీ పెద్దలు, కేవలం బీసీ నేతలను మాత్రమే టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు.
ఇక పాలనా పరమైన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఆమె ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరూ అడగకపోయినా పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి సొంతంగా ప్రకటించుకోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేబినెట్‌లోని కొందరు మంత్రులపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయని, రేవంత్ పాలనా శైలి పట్ల సొంత పార్టీలోని సీనియర్ నేతలు, మంత్రుల్లోనూ తీవ్ర అసంతృప్తి రగులుతోందని ఆమె హైకమాండ్‌కు రాతపూర్వకంగా వివరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి మంత్రి పదవి ఉంటుందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా, ఏకంగా సీఎంపైనే కొండా సురేఖ సమరశంఖం పూరించడం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.