కాంగ్రెస్ వార్నింగ్.. విజ‌య్ ప్ర‌భుత్వం కూల‌బోతుందా..?

admin
Published by Admin — September 02, 2026 in Politics, National
News Image

రాజకీయాల్లోకి వచ్చిన వేగమే సీఎం పీఠాన్ని అధిరోహించి సంచలనం సృష్టించిన దళపతి విజయ్(Thalapathy Vijay) సర్కార్‌కు ఇప్పుడు అసలు సిసలు పరీక్ష ఎదురవుతోంది. పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్ దూకుడుకు, సొంత మద్దతుదారుల అతి ఉత్సాహం బ్రేకులు వేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీతో అప్పుడే పొరపొచ్చాలు రావడంతో, తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కూడా గడవక ముందే అధికార పక్షంలో మొదలైన ఈ లుకలుకలు ఎటు దారితీస్తాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఇటీవల వెలువడిన జాతీయ సర్వే ఒకటి విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపింది. దేశ ప్రధాని రేసులో విజయ్ కూడా ఉన్నారంటూ ఆ సర్వే పేర్కొనడంతో టీవీకే(TVK) శ్రేణులు ఉబ్బితబ్బిబ్బైపోయాయి. అసలు రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా, సరికొత్త అంచనాలతో "విజయ్ ఫర్ పీఎం" అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో హడావుడి ప్రారంభించాయి. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న తరుణంలో, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కాదని విజయ్‌ను ప్రధాని రేసులో నిలపడం మిత్రపక్షానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) వైపే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ, టీవీకే తీరు మార్చుకోకపోతే క్షణం కూడా ఆలోచించకుండా మద్దతు ఉపసంహరించుకుంటామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడు అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు విపక్షాల వరుసలో సీట్లు కేటాయించడం ఆ పార్టీలో మరింత అసంతృప్తిని రాజేసింది. మిత్రపక్షాన్ని సమన్వయం చేసుకోవడంలో, అనుభవజ్ఞులైన నేతల సలహాలు తీసుకోడంలో టీవీకే అగ్రనాయకత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు విజయ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గతంలో డీఎంకే(DMK) అధినేత ఎంకే స్టాలిన్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ ప్రభుత్వం ఆరు నెలలకు మించి నిలవదని, త్వరలోనే కూలిపోతుందని స్టాలిన్ గతంలో జోస్యం చెప్పారు. సరిగ్గా ఆయన చెప్పిన గడువుకు రెండు నెలలు ముందే కూటమిలో ముసలం పుట్టడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ జోక్యం చేసుకుని ఈ సంక్షోభాన్ని చల్లార్చకపోతే, ఈ చిన్న విభేదమే పెను తుఫానుగా మారి ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ పొలిటికల్ క్రైసిస్‌ను విజయ్ ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.

Tags
Thalapathy Vijay TVK TamilNadu Politics Vijay For PM CM Vijay Congress MK Stalin
Recent Comments
Leave a Comment

Related News