అప్పుల్లో రికార్డ్‌.. కూట‌మి స‌ర్కార్ పై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

admin
Published by Admin — February 06, 2025 in Politics
News Image

లండ‌న్ ప‌ర్య‌ట‌న అనంత‌రం వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు షురూ చేశారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఓ రెండు గంటల రికార్డెడ్ ప్రెస్ మీట్ ని వదిలారు. ఈ ప్రెస్ మీట‌లో కూటమి స‌ర్కార్ పై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును చంద్ర‌ముఖి అని.. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓపక్క చంద్ర‌బాబు గ‌త వైసీపీ పాల‌న వ‌ల్ల రాష్ట్ర అభివృద్ధికి అప్పులు పుట్ట‌డం లేద‌ని నానా తిప్ప‌లు పడుతుంటే.. మ‌రోప‌క్క జ‌గ‌న్ మాత్రం కూట‌మి ప్ర‌భుత్వం తొమ్మిది నెల‌ల్లోనే అప్పుల్లో రికార్డ్ సృష్టించిందంటూ తనకు అనుకూలమైన నివేదికలు తీసుకొచ్చి లెక్క‌లు బ‌య‌ట‌పెట్టారు. 9 నెల‌ల్లో బడ్జెట్ అకౌంట్ అప్పులే రూ.80వేల కోట్లు అని.. అమరావతి పేరుతో రూ.52వేల కోట్లు, మార్క్‌ఫెడ్, సివిల్ సప్లై ద్వారా రూ.8వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా రూ.5వేల కోట్లు అప్పులు చేశార‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

మెుత్తంగా లక్ష 45 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశార‌ని కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారంటీ అంటూ తెగ ప్ర‌చారం చేశారు..ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. కానీ 9 నెలల తర్వాత బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీగా మారిందని జ‌గ‌న్ విమ‌ర్శించారు. చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే నిద్రపోతున్న చంద్రముఖిని మేల్కొలిపినట్లేనని.. ఆయ‌న అబద్దాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు.

ఆనాడు బటన్ నొక్కడం  పెద్ద పనా? ముసలోళ్లు కూడా బటన్‌ నొక్కుతారంటూ త‌మపై విమ‌ర్శ‌లు చేశారు.. మ‌రి ఈనాడు అన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా బటన్‌లు నొక్కారా? పేదలకు ఏమైనా ఇచ్చారా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. సూపర్ సిక్స్‌తో పాటు ఇచ్చిన 143 హామీలు ఏమ‌య్యాయి? తొమ్మిది నెలల కాలంలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? అని నిల‌దీశారు. వైసీపీ పథకాలు నిలిచిపోయాయి.. వలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చేతులెత్తేశారు అంటూ జ‌గ‌న్ విమ‌ర్శ‌ల దాడి చేశారు. అయితే వైసీపీ పాల‌న‌లో మద్యం స్కామ్‌పై కూట‌మి ప్రభుత్వం సిట్ వేసింది. ఈ విష‌యంపై మాత్రం జ‌గ‌న్ నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Recent Comments
Leave a Comment

Related News

Latest News